బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 27 జూన్ 2024 (19:10 IST)

అమరావతి నిర్మాణానికి రూ.10కోట్లు విరాళం: ఈనాడు ఎండీ సీహెచ్‌ కిరణ్‌ (video)

CH Kiran
CH Kiran
దివంగత ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు సంస్మరణ సభను ఏపీ ప్రభుత్వం విజయవాడలో ఏర్పాటు చేసింది. కానూరులోని అనుమోలు గార్డెన్స్‌లో రామోజీరావు సంస్మరణ సభ జరుగుతోంది. 
 
ఈ సందర్భంగా రామోజీరావు వారసులు, ఈనాడు ఎండీ సీహెచ్‌ కిరణ్‌ మాట్లాడుతూ.. "నవ్యాంధ్ర రాజధాని పేరును అమరావతిగా నాన్నగారే సూచించారు. అమరావతి దేశంలోనే గొప్ప నగరంగా మారాలి. ఆయన సంకల్పం నెరవేరాలని కోరుకుంటూ, మా కుటుంబం తరుపున, అమరావతి నిర్మాణానికి రూ.10కోట్లు విరాళం రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తున్నాం" అంటూ ప్రకటించారు. 
 
ఇంకా సీహెచ్ కిరణ్ మాట్లాడుతూ.. కృష్ణమ్మ ఒడిన రాజధాని నగరం అపురూపంగా నిర్మితం కావాలని నాన్నగారైన రామోజీ రావు బలంగా ఆకాంక్షించారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఇందులో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు ఆహ్వానం మేరకు అమరావతి శంకుస్థాపనకు హాజరై.. తన ఆనందాన్ని పంచుకున్నారని చెప్పారు.  
 
రామోజీరావుగారి ఆకాంక్ష మేరకు అమరావతి నగరం అపురూపంగా ఏర్పాటై, యావత్తు దేశానికే కీర్తి ప్రతిష్ఠలు తేవాలనే సంకల్పంతో తమ కుటుంబం తరపున పదికోట్ల రూపాయలను విరాళంగా అందజేస్తున్నామని ప్రకటించారు. 
 
తన తండ్రి రామోజీరావు ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం ఎప్పుడూ పరితపించేవారని తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా అండగా నిలబడేవారని, ఎక్కడ విపత్తులు వచ్చినా ఆదుకునేందుకు సిద్ధంగా ఉండేవారని పేర్కొన్నారు. నాన్నగారి స్ఫూర్తితో ప్రజా సంక్షేమం కోసం కట్టుబడి ఉంటానని మాటిస్తున్నాం అని కిరణ్ స్పష్టం చేశారు.