సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 23 జనవరి 2021 (10:28 IST)

ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల

ఏపీలో తొలి దశ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ను ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ శనివారం ఉదయం విడుదల చేశారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగ ఆదేశాల మేరకు స్థానిక ఎన్నికల నిర్వహణ కమిషన్ విధి అని స్పష్టం చేశారు. హైకోర్టు తీర్పు సహేతుకమే అని...ఎస్ఈసీ వాదనను హైకోర్టు విశ్వసించిందని తెలిపారు.

ఎస్ఈసీకి న్యాయవ్యవస్థపై విశ్వాసం, విధేయత ఉంటాయని చెప్పారు. కరోనా వ్యాక్సినేషన్ చేపడుతూనే విజయనగరం, ప్రకాశం మినహా మిగిలిన జిల్లాల్లో తొలి విడత ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పొలింగ్ సమయాన్ని సాయంత్రం నాలుగు గంటల వరకు పొడిగించామన్నారు. సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నామని... సీఎస్, డీజీపీలు సహా ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు వీడియో కాన్ఫరెన్సులో పాల్గొనాలని నిమ్మగడ్డ కోరారు.
 
పంచాయతీ రాజ్ కమిషనర్ మరింత మెరుగ్గా వ్యవహరించాల్సి ఉందన్నారు.పంచాయతీ రాజ్ కమిషనర్ పూర్తిగా విఫలమవ్వడం చాలా బాధాకరమని తెలిపారు. 2019 ఓటర్ల జాబితా ప్రకారమే నిర్వహిస్తున్నామని అన్నారు. విధి లేని పరిస్థితుల్లో మాత్రమే 2019 ఓటర్ల జాబితాతో ఎన్నికల నిర్వహణ చేపట్టాల్సి ఉందని ఆయన  పేర్కొన్నారు.

కొత్త ఓటర్ల జాబితాను సిద్ధం చేయడంలో పీఆర్ కమిషనర్ అలక్ష్యంతో ఉన్నారని విమర్శించారు. పీఆర్ కమిషనర్‌పై సరైన సమయంలో చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వ సూచనలు సహేతుకంగా లేవన్నారు. ఎన్నికలను వాయిదా వేయాలన్న ప్రభుత్వ సూచనను తిరస్కరిస్తున్నామని చెప్పారు.

ప్రభుత్వం తీరు కూడా సరిగా లేదని వ్యాఖ్యానించారు. సీఎస్ తనకు రాసిన లేఖ తనకంటే ముందుగానే మీడియాకు చేరిందన్నారు. ఆర్టీఐ నుంచి మినహాయింపులున్నా కమిషన్ విషయంలో జరిగే ఉత్తర ప్రత్యుత్తరాల్లో గోప్యత పాటించాల్సి ఉంటుందని నిమ్మగడ్డ రమేష్‌కుమార్ చెప్పుకొచ్చారు.