బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 12 మే 2020 (21:55 IST)

ఏపీ ఆలయాల్లో భక్తులకు ప్రవేశం?

ఆంధ్రప్రదేశ్ లోని ఆలయాల్లోకి త్వరలోనే భక్తులకు ప్రవేశం లభించే అవకాశం ఉంది. దీనిపై ఇప్పటికే ఆయా ఆలయాల యాజమాన్యాలు ఏర్పాట్లు చేపడుతున్నాయి.

లాక్‌డౌన్ నుంచి పరిస్థితులు మెల్లిమెల్లిగా సాధారణ స్థితికి చేరుకుంటున్నాయని భావిస్తోన్న నేపధ్యంలో కరోనా వైరస్ ఇప్పుడప్పుడే మానవాళిని దిలిపోయే అవకాశం లేదని ప్రకటిస్తున్న ప్రభుత్వాలు.. వాటితో కలిసి జీవించడం నేర్చుకోవాలని చెబుతున్నాయి.

ఈ క్రమంలోనే మెల్లిమెల్లిగా లాక్‌డౌన్ కారణంగా మూతపడ్డ వ్యవస్థలను తిరిగి తెరిచేందుకు సిద్ధమవుతున్నాయి. అందులో దేవాలయాలు కూడా ఉన్నాయి. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి, కాణిపాకం దేవాలయాల్లో భౌతిక దూరం పాటిస్తూ భక్తులను ఆలయాల్లోకి అనుమతించే అంశంపై కసరత్తు మొదలైంది.

ఈ రెండు ఆలయాల్లోని భక్తుల క్యూ లైన్లలో భౌతిక దూరం పాటించేలా సిబ్బంది సర్కిల్స్ గీశారు. లాక్ డౌన్ ఎత్తివేసిన తరువాత భక్తులను ఆలయాల్లోకి అనుమతించి భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని ఈ రెండు దేవస్థానాలకు సంబంధించిన అధికారులు భావిస్తున్నట్టు తెలుస్తోంది.
 
శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్?
శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం గుడ్ న్యూస్ చెప్పనుందని తెలుస్తోంది. దర్శనానికి భక్తులను అనుమతించేందుకు సిద్దమవుతోంది. కేంద్రం నుంచి వచ్చే ఆదేశాలను బట్టి దర్శనానికి భక్తుల అనుమతిపై తేదీని ఖరారు చేయనున్నట్టు తెలుస్తోంది.

భౌతిక దూరం పాటించాల్సి ఉండడంతో దర్శన విధానంలో మార్పులు చేసేందుకు టీటీడీ సిద్ధమవుతున్నట్టు సమాచారం. గతంలోలా కాకుండా పరిమిత సంఖ్యలోనే భక్తులను దర్శనానికి అనుమతి ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. క్యూ కాంప్లెక్స్‌లో భక్తులు వేచి ఉండే విధానానికి తాత్కాలికంగా టీటీడీ స్వస్తి పలకనున్నట్టు సమాచారం.

టైం స్లాట్ కింద వచ్చిన భక్తులకు వెంటనే శ్రీవారి దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేయనుంది. ట్రయిల్ కింద స్థానికులను దర్శనానికి అనుమతించనున్నట్టు తెలుస్తోంది. ఈ విధానాన్ని పరిశీలించి తదుపరి దర్శన విధానం అమలుపై టీటీడీ నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. అంతా ఓకే అయితే ఇక త్వరలో భక్తులకు శ్రీవారి దర్శనానికి అనుమతి లభించనుంది.
 
దుర్గమ్మ దర్శనానికి ఏర్పాట్లు
లాక్‌డౌన్ అనంతరం దుర్గమ్మ దర్శనానికి భక్తులకు తగు ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ ఈవో సురేష్ బాబు తెలిపారు. కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం దేవాలయంలో 30 అడుగుల పొడవైన డిస్ ఇన్ఫెక్షన్ టన్నెల్‌ నిర్మాణం చేపట్టారు.

అమ్మవారి దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడు భౌతిక దూరం పాటిస్తూ ఈ టన్నెల్‌ ద్వారా మాత్రమే దేవాలయంలోకి ప్రవేశించే విధంగా ఏర్పాటు చేశారు. ఈ టన్నెల్‌ను ఈవీ సురేష్ బాబు, ప్రధాన అర్చకులు దుర్గా ప్రసాద్, తదితర సిబ్బంది పరిశీలించారు.