కేంద్రం గుడ్ న్యూస్- ఈఎస్ఐసీ ప్రత్యేక పథకం.. అర్హులు ఎవరంటే?  
                                       
                  
				  				  
				   
                  				  కరోనా వైరస్‌తో మరణించిన కార్మికుల కుటుంబసభ్యులకు పింఛన్ అందించేందుకు ఈఎస్ఐసీ ప్రత్యేక పథకాన్ని ప్రారంభించినట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి రామేశ్వర్ తెలీ తెలిపారు. రాజ్యసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు బుధవారం రాతపూర్వకంగా ఇచ్చిన జవాబులో..2020 మార్చి 23వ తేదీ నుంచి ప్రారంభించిన ఈఎస్‌ఐసీ కోవిడ్-19 రిలీఫ్ స్కీమ్ రెండేళ్లపాటు అమలులో ఉంటుందని మంత్రి చెప్పారు.
				  											
																													
									  
	 
	ఈఎస్‌ఐసీ వద్ద ఇన్సూర్ అయిన కార్మికులపై ఆధారపడిన కుటుంబసభ్యులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని తెలిపారు. ఈఎస్‌ఐసీ కోవిడ్ రిలీఫ్ పథకం కింద..మరణించిన కార్మికుడు లేదా ఉద్యోగిపై ఆధారపడిన అర్హులైన కుటుంబసభ్యులకు ఉద్యోగి పొందే వేతనంలో సగటున 90 శాతం మొత్తాన్ని పింఛన్ కింద చెల్లిస్తామని తెలిపారు.
				  
	 
	కరోనా సోకినట్లుగా గుర్తించిన రోజు నుంచి మూడు నెలల ముందు సదరు కార్మికుడు లేదా ఉద్యోగి తప్పనిసరిగా ESIC ఆన్‌లైన్ పోర్టల్‌లో పేరు నమోదు చేసుకుని ఉండాలి. కరోనా బారిన పడటానికి ముందు కనీసం 70 రోజుల పాటు ఆ ఉద్యోగి తరఫున ఈఎస్‌ఐసీ చందా చెల్లిస్తూ ఉండాలి.
				  																								
	 
 
 
  
	
	
																		
									  
	 
	కోవిడ్‌తో మరణించిన వ్యక్తి మహిళ ఉంటే పింఛన్ ప్రయోజనం భర్తకు లభిస్తుంది. ప్రస్తుతం అమలులో ఉన్న పింఛన్ నిబంధనల ప్రకారం కార్మికుడు మరణానంతరం అతడి భార్య తిరిగి వివాహం చేసుకునే వరకు పింఛన్‌కు అర్హురాలు. అయితే ఈఎస్‌ఐసీ కోవిడ్ రిలీఫ్ పథకం కింద పింఛన్‌కు అర్హురాలైన మహిళకు ఈ నిబంధన వర్తించదు.
				  																		
											
									  
	 
	లబ్ధిదారుడు కుమారుడైతే అతడికి 25 ఏళ్లు నిండే వరకు, కుమార్తె అయితే వారికి వివాహం జరిగే వరకూ పింఛన్ పొందడానికి అర్హులు. ఉద్యోగుల భవిష్య నిధిలో సభ్యులైన కార్మికులు లేదా ఉద్యోగులకు కూడా ఈఎస్‌ఐసీ కోవిడ్ రిలీఫ్ పథకం వర్తిస్తుంది.