1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 4 జూన్ 2020 (18:36 IST)

అధికారులు ఉండేది కాఫీలు - టిఫెన్లు మోయడానికా? మాజీ మంత్రి ఆనం ప్రశ్న

నెల్లూరు జిల్లాకు చెందిన వెంకటగిరి ఎమ్మెల్యే, మాజీమంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆ జిల్లా అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఉండేది మంత్రులకు కాఫీలు, టిఫెన్లు మోయడానికా అంటూ బహిరంగంగా ప్రశ్నించారు. 
 
అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేగా ఉన్న ఆనం రామనారాయణ రెడ్డి... నీటి పారుదల శాఖలో అధికారులు నీళ్లు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. స్వర్ణముఖి లింక్ కెనాల్‌ను పరిశీలించాలని సీఎం చెప్పినా అధికారులు వినిపించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
జిల్లా అధికారులు ఉన్నది మంత్రులకు కాఫీ, టిఫిన్లు మోసేందుకా? అంటూ ఆనం నిప్పులు చెరిగారు. వెంకటగిరి నియోజకవర్గాన్ని మర్చిపోయారా? అంటూ మండిపడ్డారు. 
 
రావూరులోని గిరిజన బాలికల గురుకుల పాఠశాల కోసం స్థలం అవసరముందని, ఐదు ఎకరాల భూమి కోసం ప్రిన్సిపల్ ఇంకా వెతుకుతూనే ఉన్నారని ఆనం వెల్లడించారు. గిరిజన గురుకులం భనవ నిర్మాణం గురించి ఐటీడీఏ పీఓ పట్టించుకోవడంలేదని విమర్శించారు. 
 
ముఖ్యంగా, జలవనరుల శాఖలో అధికారులు నీళ్లు అమ్ముకుంటున్నారని, ఎస్‌ఎస్‌ కెనాల్‌ను పరిశీలించాలని సీఎం జగన్ చెప్పినా అధికారులు వినడంలేదని మండిపడ్డారు. ఇలాంటి పరిస్థితులు తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడలేదన్నారు. 
 
23 జిల్లాలకు మంత్రిగా చేసిన తనకు, ఎమ్మెల్యే పదవి అలంకారం కాదన్నారు. ప్రజల కోసం ప్రభుత్వాన్ని, అధికారులను నిలదీయడానికి సిద్ధమని ఆనం రామనారాయణరెడ్డి ప్రకటించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం మంత్రులకు డీపీఆర్‌లు ఇచ్చామని... అవి ఎక్కడ ఉన్నాయో కూడా తనకు తెలియదని చెప్పారు. 
 
అంతేకాకుండా, గత యేడాది కాలంలో తన నియోజకవర్గానికి ఏ ఒక్క పని చేయలేక పోయినట్టు వాపోయారు. తన నియోజకవర్గ ప్రజలకు సంక్షేమ కార్యక్రమాల ద్వారా నేరుగా అందేవి తప్ప... ఇతర ఏ కార్యక్రమాలనూ తాను చేయలేకపోతున్నానని మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పుకొచ్చారు.