శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By శ్రీ
Last Updated : ఆదివారం, 19 జనవరి 2020 (17:42 IST)

మాజీ ఎంపీ రాయపాటికి సి.బి.ఐ అధికారులమంటూ బురిడీ

సి.బి.ఐ అధికారుల పేరు చెప్పి, మాజీ ఎంపీ రాయపాటికి బురిడీ కొట్టే ప్రయత్నం చేశారో ఇద్దరు ఆగంతకులు. సి.బి.ఐ కేసుల నుంచి తప్పిస్తామని, కేసులను మాఫీ చేసేందుకు పెద్ద మొత్తంలో డబ్బులు కావాలని రాయపాటికి ఫోనులో డిమాండ్ చేశారు. 
 
ఢిల్లీ సి.బి.ఐ కార్యాలయం నుంచి ఫోను చేస్తున్నామని కేసుల నుంచి బయటపడేందుకు తాము పూర్తి స్థాయిలో సహాయం చేస్తామంటూ హామీ ఇచ్చారు. ఈ ఫోను కాల్ వ్యవహారంపై ఢిల్లీ సి.బి.ఐ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు రాయపాటి సాంబశివరావు.
 
దీంతో రంగంలోకి దిగిన సి.బి.ఐ అధికారులు రెండురోజులు నిఘా పెట్టి హైదరాబాద్ చెందిన మణివర్ధన్ రెడ్డితో పాటుగా చెన్నైకి చెందిన సెల్వంను  అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. హైదరాబాద్ చెన్నైలలో వీరి ఇళ్లలో సోదాలు నిర్వహించిన అధికారులు ఇరువురు దగ్గర నుంచి సెల్ ఫోనుల  స్వాధీనం చేసుకున్నారు. 
 
కొందరు ప్రముఖులను  బెదిరింపులకు పాల్పడిన కొన్ని వాట్సాప్ మెసేజ్‌లను కూడా సిబిఐ అధికారులు గుర్తించారు. గత డిసెంబరులో రాయపాటికి చెందిన ట్రాన్స్‌ట్రాయ్ కంపెనీ రూ.300 కోట్లు బ్యాంకు నుంచి రుణం తీసుకుని తిరిగి చెల్లించని కారణంగా సిబిఐ అధికారులు కేసు నమోదు చేసిన సంగతి తెల్సిందే.