రైతును చంపేసిన శునకాలు.. ఎలా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ ఘోరం జరిగింది. ఓ రైతును కుక్కలు చంపేశాయి. ఈ దారుణం ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లా జయ్యమ్మవలస మండలంలో జరిగింది. ఈ మండలంలో కుక్కల దాడిలో రైతు ప్రాణాలు కోల్పోయాడు. బిత్రపాడు గ్రామానికి చెందిన నీరస శంకర రావు (40) సోమవారం ఉదయం గ్రామ శివారు ప్రాంతంలోని చెరువు వద్దకు వెళ్లాడు. అక్కడ ఉన్న ఐదారు కుక్కలు ఆయనను చూసి మీదికి ఎగబడి దాడిచేశాయి. కుక్కలన్న ఒకేసారి దాడి చేయడంతో శంకరరావు తప్పించుకోలేక పోయాడు.
వాటి దాడిలో తొడలు, కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో తీవ్ర రక్తస్రావం కావడంతో అక్కడే కుప్పకూలిపోయాడు. శంకర రావు అరుపులకు అక్కడికి చేరుకున్న స్థానికులకు కుక్కలను తిరిమి కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేశారు. వారు వెంటనే వచ్చిన చినమేరంగి పీహెచ్‌సీకి తరలించారు. అయితే, బాధితుడు అప్పటికే మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.
మచిలీపట్నంలో వైకాపా నేతల అరాచకం : జనసేన నేత కారుకు నిప్పు!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైకాపా నేతల అరాచకాలకు అడ్డూ అదుపు లేకుండా పోతుంది. తమకు ఎదురు తిరిగే వారిపై దాడులకు తెగబడుతున్నారు. ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. వాహనాలకు నిప్పు అంటిస్తున్నారు. భౌతిక దాడులకు పాల్పడుతున్నారు. వీరిపై పోలీసులు సైతం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో వైకాపా నేతల అరాచకాలు మరింతగా హెచ్చుమీరిపోతున్నాయి. తాజాగా కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వైకాపా కార్యకర్తలు మరింతగా రెచ్చిపోయారు. జనసేన నాయకుడు కర్రి మహేశ్ కారును తగులబెట్టారు. ఇంటిముందు పార్క్ చేసిన కారుకు నిప్పు పెట్టడంపై మహేశ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటనాస్థలికి వచ్చి దర్యాప్తు చేపట్టారు.
'ఆదివారం అర్థరాత్రి 2 గంటల తర్వాత నా కారును వైకాపా గూండాలు తగులబెట్టారు. జనసేన తరపున ప్రచారం చేస్తే నాపై వారికెందుకు అంత పగ? జగన్‌ను మాత్రమే అభిమానించాలనే శాసనం ఏమైనా ఉందా? పవన్ కల్యాణ్ కోసం పనిచేస్తే తట్టుకోలేకపోతున్నారు. గతంలోనూ అర్థరాత్రి మా ఇంటిపై దాడి చేశారు. మమ్మల్ని కొట్టి చంపాలని చూశారని కేసు పెట్టాం. ఒక్క రోజులో వారంతా బయటకి వచ్చి దర్జాగా తిరుగుతున్నారు. ఇప్పుడు నా కారును తగులబెట్టి రాక్షసానందం పొందుతున్నారు.
కారుకు పెట్టిన మంటలు మా ఇంటి గోడ వైపు వ్యాపించాయి. వంట గది అటువైపే ఉంది. అందులోకి మంటలు వ్యాపించి ఉంటే మా కుటుంబం మొత్తం చనిపోయేవాళ్లం. వైకాపా వాళ్లను తిట్టలేదు.. వాళ్లతో గొడవకి వెళ్లలేదు. పవన్ కల్యాణ్‌పై అభిమానంతో జనసేనకు పనిచేస్తున్నా. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇలా చేస్తారా? పోలీసులు సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లే వైకాపా నేతలు దాడులకు తెగబడుతున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని ఎస్పీని కోరుతున్నాను' అని కర్రి మహేశ్ అన్నారు.