శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 24 జనవరి 2020 (15:11 IST)

రాష్ట్రానికి పట్టిన శనిని పట్టుకొని దేవుడు అంటావా? విజయ్‌చందర్‌కు చుక్కలు

స్థానిక బృందావన్ గార్డెన్స్‌లో ఉన్న వేంకటేశ్వర దేవాలయంలోని అన్నమయ్య కళావేదికలో హైదరాబాద్‌కు చెందిన యువకళా వాహిని, సారిపల్లి కొండలరావు ఫౌండేషన్ సంయుక్తంగా సాంస్కృతిక కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరయిన విజయ్ చందర్ జగన్‌పై పొగడ్తల వర్షం కురిపించబోయారు. 
 
అసలే రాజధాని తరలింపుపై ఆవేశంగా ఉన్న స్థానిక ప్రేక్షకులు ఇక చాలు ఆపమని గొడవ చేశారు. ఇదేమి పట్టించుకోని ఏపీ ఫిల్మ్ అండ్ టీవీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ విజయచందర్ తన పొగడ్తలు కొనసాగిస్తుండగా
 ప్రేక్షకులు తీవ్ర వ్యతిరేకతతో స్టేజి వైపు దూసుకు వచ్చారు. ఊహించని సంఘటనతో కంగారుపడి ప్రసంగం మధ్యలోనే ముగించాడు. 
అయినా శాంతించని ప్రేక్షకులు స్టేజి పైకి ఎక్కేందుకు ప్రయత్నించగా పరిస్థితి అదుపు తప్పుతుందని గమనించిన  నిర్వాహకులు అర్ధాంతరంగా విజయచందర్‌ను సభ నుండి కారు వద్దకు తీసుకవెళ్లే ప్రయత్నం చేశారు.
 
ఆ మార్గ మధ్యలో మహిళలు కూడా రాక్షసుడిలా మా భవిష్యత్‌ను నాశనం చేస్తూ, రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తుంటే నీకు దేవుడిలా కనిపిస్తున్నాడా అంటూ విజయచందర్ పై వాగ్వాదానికి దిగారు. వారినుండి తప్పించుకొని కారు ఎక్కి వెళ్లబోతుండగా అక్కడి చేరుకున్న ప్రేక్షకులు కారును కదలనీయకుండా అడ్డంగా ఉండి గొడవకు దిగారు. 
 
సాంస్కృతిక కార్యక్రమానికొచ్చి రాజకీయాలు మాట్లాడతావా, రాష్ట్రానికి పట్టిన శనిని పట్టుకొని దేవుడు అంటావా అంటూ కారు కదలటానికి కూడా అవకాశం లేకుండా చుట్టుముట్టారు. దాదాపు అర్ధగంట పాటు గందరగోళ పరిస్థితిలో కారు దిగిన విజయచందర్ రెండు చేతులు జోడించి క్షమాపణ వేడుకున్నాడు.. దీంతో శాంతించిన ప్రేక్షకులు కారుకు దారి ఇచ్చారు.