ఎన్నికల ముందు పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీకి కట్టుబడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన మహిళల ఆర్థికాభివృద్ధికి వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా పథకాల ద్వారా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రూ.44 వేల కోట్లు వెచ్చిస్తున్నట్లు రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్యకార శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు తెలిపారు.
సచివాలయంలో నాలుగో బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు నిర్వహించిన పాదయాత్రలో మహిళల కష్టాలను చూసిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిననాటి నుంచే వారి ఆర్థికాభివృద్ధికి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారన్నారు.
ముఖ్యంగా వైఎస్సార్ చేయూత పథకం, వైఎస్సార్ ఆసరా పథకం మహిళలు ఆర్థిక స్వాలంబన సాధించడానికి అవకాశం కలుగుతుందన్నారు. ఈ రెండు పథకాల వల్ల అందే ఆర్థిక సాయంతో మహిళలు స్వయం ఉపాధి పొందేలా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తుందన్నారు. ఇందులో భాగంగా తమ శాఖ ద్వారా పలు యూనిట్ల స్థాపనకు ప్రణాళికలు సిద్ధం చేశామని మంత్రి అప్పలరాజు తెలిపారు.
‘చేయూత’ రూ.75 వేలు ఒకేసారి...
కుటుంబ ఆర్థిక పరిస్థితులు మెరుగుపర్చుకునేలా మహిళలకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నగా, తమ్ముడి అండగా నిలిచారని మంత్రి సీదిరి అప్పలరాజు కొనియాడారు. వైఎస్సార్ చేయూత పథకం ద్వారా రూ.18,750 చొప్పున నాలుగేళ్ల పాటు రూ.17 వేల కోట్లను 23 లక్షలకు పైగా 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు అందజేయాలని తొలుత సీఎం జగన్ నిర్ణయించారన్నారు.
విడతలవారీగా చేయూత ఆర్థిక సాయం ఇవ్వడం మహిళలు ఆ సాయాన్ని ఇతర అవసరాలకు వినియోంచే అవకాశముందనే ఉద్దేశంతో ఒకేసారి రూ.75 వేలు అందజేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారన్నారు.
ఈ మొత్తాన్ని బ్యాంకు ద్వారా ఇప్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీగా ఉంటుందన్నారు. మూడేళ్లకు చెందిన ఆర్థిక సాయాన్ని ముందుగా ఇస్తున్న నేపథ్యంలో లబ్ధిదారులు ఎటువంటి వడ్డీ చెల్లించాల్సిన అవసరంలేదని మంత్రి అప్పలరాజు తెలిపారు.
మహిళల ఆర్థిక భరోసాకు రూ.44 వేల కోట్లు...
మహిళలకు ఆర్థిక భరోసా కల్పించాలనే లక్ష్యంతో అధికారంలోకి వచ్చిన నాటినుంచే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని మంత్రి సీదిరి అప్పలరాజు తెలిపారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన మహిళల కోసం వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా పథకాలను తీసుకొచ్చారన్నారు. వైఎస్సార్ చేయూత కింద 23 లక్షలకు పైగా మహిళలకు నాలుగేళ్లకు రూ.17 వేల కోట్లు, వైఎస్సార్ ఆసరా కింద రూ.27 వేల కోట్లు...మొత్తం రూ.44 వేల కోట్లు మహిళల కోసం తమ ప్రభుత్వం వెచ్చిస్తోందన్నారు.
మరో శ్వేత విప్లవానికి సీఎం జగన్ శ్రీకారం...
మరో శ్వేత విప్లవానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టనున్నారని మంత్రి సీదిరి అప్పలరాజు వెల్లడించారు. తమ శాఖ ద్వారా వైఎస్సార్ చేయూత, ఆసరా పథకాల కింద పెద్ద ఎత్తున డెయిరీ యూనిట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు.
ఈ యూనిట్ల కింద ఆవులు, గేదెల పెంపకంతో పాటు పడ్డలు, దూడల పెంపకం యూనిట్ల కూడా స్థాపనకు ప్రోత్సాహామివ్వనున్నామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉత్పత్తవుతున్న పాలులో 80 శాతానికి పైగా అసంఘటిత రంగం ద్వారా సేకరిస్తున్నారన్నారు. కేవలం 20 శాతం పాలు మాత్రమే సంఘటిత రంగం ద్వారా సేకరిస్తున్నారన్నారు.
గుజరాత్ లో 80 శాతానికిపైగా పాలును సంఘటిత రంగం నుంచి సేకరిస్తున్నారని మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో ఉత్పత్తయిన పాలును సంఘటిత రంగం నుంచే కొనుగోలు చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే అమూల్ కంపెనీతో తమ ప్రభుత్వం ఒప్పందం చేసుకుందన్నారు. దీనివల్ల ఎన్నిల ముందు ఇచ్చిన హామీ మేరకు లీటరు పాల ధర పెరగడం ఖాయమన్నారు. ఈ నిర్ణయం పాడి రైతులకు ఎంతో లబ్ధి చేకూరుస్తుందన్నారు.
యూనిట్ల స్థాపనకు 12,81,067 దరఖాస్తులు రాక...
వైఎస్సార్ చేయూత కింద లబ్ధి పొందే మహిళలు తమకిష్టమైన యూనిట్లను స్థాపించుకునే సౌలభ్యం రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందని మంత్రి అప్పలరాజు వెల్లడించారు. వ్యక్తిగతంగా, గ్రూపుగా యూనిట్లను స్థాపించుకోవొచ్చునన్నారు. దీనిలో భాగంగా పశు సంవర్ధక, మత్స్యకార శాఖ ఆధ్వర్యంలో పలు యూనిట్ల స్థాపనకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు.
సంప్రదాయ యూనిట్లైన పశువులు, గొర్రెలు, మేకల పెంపకం, టైలరింగ్, కిరాణా తదితర యూనిట్లు ఏర్పాటు చేసుకోవొచ్చునన్నారు. వాటితో పాటు మొక్క జొన్న దాణా, డిస్టలరీల వృథా నుంచి దాణా ఉత్పత్తి యూనిట్లు, సంప్రదాయ తెప్పలకు(పడవలు) ఇంజన్లు అమర్చడం వంటి యూనిట్ల కూడా ఏర్పాటు చేసుకోవొచ్చునన్నారు.
ఆవులు పెంపకానికి 1,51,091 దరఖాస్తులు, గేదెల పెంపకం యూనిట్లకు 1,57,000, గొర్రెలకు రూ.1,04,300, మేకలకు 62,900, కిరణా ఇతర వ్యాపార యూనిట్లకు 6,15,963 మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. మొత్తంగా 12,81,067 దరఖాస్తులు వచ్చినట్లు మంత్రి అప్పలరాజు వెల్లడించారు. రాష్ట్రంలో పశువుల వ్యాధుల నివారణకు రైతుల ఇంటి వద్దకే పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో వ్యాక్సిన్లు, ఇంజక్షన్లు, మందులు పంపిణీ చేస్తున్నామన్నారు.