శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PY REDDY
Last Updated : గురువారం, 18 డిశెంబరు 2014 (07:33 IST)

‘చందన బ్రదర్స్’ దగ్ధం.. తిరుపతిలో భారీ అగ్ని ప్రమాదం

తిరుపతి గాంధీ రోడ్డులోని చందన బ్రదర్స్ షోరూంలో బుధవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సెక్యూరిటీ గార్డులు చూస్తుండగానే నగలు, దుస్తులు కాలి బూడిదయ్యాయి. దాదాపు రూ. 10 కోట్ల వరకూ నష్టం వాటిల్లి ఉంటుందని భావిస్తున్నారు. పక్కనే ఉన్న ద్విచక్రవాహనాలూ కాలి బూడిదయ్యాయి. 
 
ఐదు అంతస్తులున్న షోరూంలో గ్రౌండ్ ఫ్లోర్‌లో నగల దుకాణం, మిగిలిన రెండు అంతస్తుల్లో దుస్తుల దుకాణాలు ఉన్నాయి. రాత్రి 10 గంటల ప్రాంతంలో షోరూంను మూత వేసి నిర్వాహకులు, సిబ్బంది వెళ్లిపోయారు.  కొద్ది నిమిషాల్లోనే గ్రౌండ్ ఫ్లోర్‌లో మంటలు చెలరేగాయి. షాపు ముందే ఉన్న సెక్యూరిటీ గార్డు మంటలు అదుపు చేయలేకపోయాడు. వెంటనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. దుస్తుల దుకాణం కావడంతో మంటలు వెంటనే మూడు అంతస్తుల్లోకి వ్యాపించాయి.  మంటలు, పొగలతో చుట్టుపక్కల జనం బెంబేలెత్తిపోయారు. ఈ లోపు అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు. 
 
దుకాణం షట్టర్ తెరుచుకోకపోవడంతో మంటలను అదుపు చేయడానికి చాలా కష్టమైంది. విద్యుత్ సరఫరా నిలిపివేసి మంటలనార్పడం మొదలు పెట్టారు. తిరుమల, పుత్తూరు, శ్రీకాళహస్తి, చిత్తూరు ప్రాంతాల నుంచి కూడా ఆరు అగ్నిమాపక వాహనాలను రప్పించారు. పండుగలు రానుండడంతో 200 బేళ్లు వస్త్రాలు తెచ్చి ఉంచినట్లు నిర్వాహకులు తెలిపారు. బంగారం సుమారు 20 నుంచి 30 కేజీల వరకు ఉంటుందని తెలిపారు. దాదాపు 10 కోట్ల వరకు నష్టం వాటిల్లి ఉంటుందని వివరించారు.