ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్

కైకలూరు మాజీ ఎమ్మెల్యే దూలం అవినీతి పేరుతో వెలిసిన ఫ్లెక్స్.. ఆసక్తిగా చదువుతున్న స్థానికులు!!

doolam nageswara rao
వైకాపాకు చెందిన కైకలూరు మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వర రావు గత ఐదేళ్ల కాలంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని భారీగా అవినీతికి పాల్పడ్డారు. ఇపుడు ప్రభుత్వం మారడంతో ఆయన చేసిన అవినీతిని వివరిస్తూ నియోజకవర్గం వ్యాప్తంగా ఫ్లెక్సీలు వెలుస్తున్నాయి. ఈ ఫ్లెక్సీల్లో ఆయన చేసిన అవినీతి వివరించగా, నియోజకవర్గ వాసులు అమితాసక్తితో చదువుతున్నారు. ఇపుడు ఈ ఫ్లెక్సీలు కైకలూరులో కలకలం రేపుతున్నాయి. 
 
దూలం నాగేశ్వరరావు బాధితుల సంఘం అధ్యక్షుడినంటూ జనసేన నేత కొల్లి వరప్రసాద్‌ పేరిట కైకలూరులోని సంత మార్కెట్, తాలూకా, కోరుకొల్లు రోడ్డు, రైల్వేస్టేషన్‌ వంటి ప్రధాన కూడళ్లలో సోమవారం ఉదయం ఈ ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి. కైకలూరు నగర పంచాయతీ కాకుండా అడ్డగించడం.. జగనన్న కాలనీల్లో జరిగిన అవినీతి, ప్రభుత్వ భవనాల కూల్చివేత.. అమాయకులపై అక్రమ కేసులు, రౌడీ మూకలతో పోలీస్‌స్టేషన్లోనే దాడులు చేయించడం వంటి 27 అంశాలను ఇందులో పొంది పరిచి బాధితుల పేర్లను ప్రస్తావించారు. 
 
ఇక సంత మార్కెట్‌ వైఎస్సార్‌ విగ్రహం సమీపంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వివాదాస్పదంగా మారింది. వైఎస్సార్‌ జయంతిని పురస్కరించుకుని వైకాపా నాయకులు జనసేన నేత ఫ్లెక్సీని తీసి మాజీ ఎమ్మెల్యే ఫ్లెక్సీ కట్టేందుకు యత్నించారు. దీంతో ఇరు వర్గాలు అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దారు. రెండు ఫ్లెక్సీలు ఉంచి వివాదాలు లేకుండా కార్యక్రమం నిర్వహించుకోవాలని వైకాపా నాయకులకు సూచించారు.
 
ఈ సందర్భంగా జనసేన నేత కొల్లి వరప్రసాద్‌ (బాబీ) విలేకరులతో మాట్లాడుతూ.. మాజీ ఎమ్మెల్యే చేసిన అక్రమాలకు ఈ ఫ్లెక్సీలు మచ్చుకు మాత్రమేనని తెలిపారు. రానున్న రోజుల్లో ఆయన చేసిన అవినీతి, దౌర్జన్యకాండ, అరాచకాలను బయటపెట్టి ప్రజాక్షేత్రంలోనే బుద్ధి చెబుతామని చెప్పారు. తాను ఆరోపించిన అక్రమాలపై మాజీ ఎమ్మెల్యే ఆయన తనయులు బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్‌ విసిరారు.