గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: శనివారం, 28 నవంబరు 2020 (17:38 IST)

నివర్ తుఫాన్‌లో మరణించిన వారికి రూ. 5 లక్షలు: ఉపముఖ్యమంత్రి బాషా

తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయంలో వరదపై సమీక్షా సమావేశం నిర్వహించిన తరువాత బయటకు వచ్చిన ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా మీడియాతో మాట్లాడారు. మానవతా దృక్ఫథంతో అధికారులు పనిచేయాలని.. ఏ రైతు నష్టపోకూడదని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. పంట నష్టపోయిన రైతులకు సంబంధించి పూర్తి వివరాలను నివేదిక రూపంలో డిసెంబర్ 15వ తేదీ లోగా ఇవ్వాలని సిఎం అధికారులను ఆదేశించినట్లు ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా చెప్పారు. 
 
అలాగే నివర్ తుఫాన్ ప్రభావంతో చిత్తూరు జిల్లాలో ఆరుగురు, కడప జిల్లాలో ఇద్దరు మృతి చెందారని, మృతి చెందినవారి కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేస్తామన్నారు. వెంటనే బాధితులకు ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నట్లు ఉపముఖ్యమంత్రి చెప్పారు. అంతేకాకుండా కడప జిల్లాలో వరద నీటిలో కొట్టుకుపోయిన బుగ్గవంకను 39 కోట్ల రూపాయలతో సుందరీకరణ చేసేందుకు సిఎం ఆమోదించారని, అలాగే పింఛా నది, అన్నమాచార్య ప్రాజెక్టుల ఎత్తును కూడా పెంచుతున్నట్లు చెప్పారు.
 
వరదలతో కొట్టుకుపోయిన రోడ్లను త్వరలో పునరుద్ధరిస్తామని, కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాలలో లక్షల హెక్టార్లలో పంట నష్టపోయిన మాట వాస్తవమేనన్నారు. డిసెంబర్ 15వ తేదీ లోపు పంట నష్టంపై నివేదికలను పరిశీలించిన తరువాత డిసెంబర్ 30లోగా బాధితులకు నష్టపరిహారాన్ని అందజేస్తామన్నారు.