గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 16 ఫిబ్రవరి 2023 (13:22 IST)

బీజేపీ టాటా చెప్పేసిన కన్నా లక్ష్మీనారాయణ

kanna
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పార్టీకి రాజీనామా చేశారు. రాష్ట్ర నాయకత్వ తీరు ఏమాత్రం బాగోలేకపోవడంతో ఆయన తన నిరసనను వ్యక్తం చేస్తూ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. 
 
ఇదే విషయంపై ఆయన గురువారం ఉదయం తన ముఖ్య అనుచరులతో సమావేశమయ్యారు. ఆ తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే, కన్నా లక్ష్మీనారాయణ రాజీనామాపై ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు తప్పించుకునే ప్రయత్నం చేశారు. కన్నా రాజీనామాపై పార్టీ అధిష్టానం స్పందిస్తుందంటూ దాటవేశారు.
 
కాగా, గత 2014లో ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వం పట్ల ఆకర్షితులై బీజేపీలో చేరిన కన్నా... అప్పటి నుంచి పార్టీలో కొనసాగుతూ పార్టీ పటిష్టత కోసం కృషి చేస్తూ ఒక కార్యకర్తలా పని చేశారు. దీనికి ఫలితంగా ఆయన్ను గత 2018లో బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా నియమించింది. 
 
కోవిడ్ మహమ్మారి తర్వాత ఆయన్ను తప్పించి పార్టీ నాయకత్వం బాధ్యతలను సోము వీర్రాజుకు అప్పగించారు. అప్పటి నుంచి రాష్ట్రంలో పగలు, కక్ష సాధింపు చర్యలపైనే పార్టీ నేతలు దృష్టిసారించారని ఆయన ఆరోపించారు. స్థానిక నాయకులకు డబ్బు సంపాదనే లక్ష్యంగా మారిందని, పార్టీని నమ్ముకున్న కార్యకర్తలను ఎవరూ పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈ పరిస్థితుల్లో పార్టీలో ఇమడ లేకే తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు.