శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 7 డిశెంబరు 2019 (11:45 IST)

గంటా జంప్ అవ్వడం ఖాయమేనా..?

ఉన్న మాట అంటే ఉలుకెందుకు? అన్న ప్రశ్నకి తగ్గట్టే ఉందట మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వ్యవహారం! విశాఖ ఉత్తర నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే గంటా ఆ పార్టీని వీడతారని గత కొన్ని నెలల నుంచి జోరుగా ప్రచారం జరిగింది. అధికార వైసీపీ తీర్థం పుచ్చుకుంటారని కూడా టాక్‌ వినిపించింది.

అయితే జిల్లా వైసీపీలో చక్రం తిప్పుతున్న మంత్రి ఆయన రాకను తీవ్రంగా వ్యతిరేకించడంతో ఆ ప్రయత్నానికి బ్రేక్ పడిందట. వైసీపీలోకి గంటా వస్తే పార్టీకి మంచికంటే చెడే ఎక్కువ జరుగుతుందని ఆ మంత్రి అధిష్టానం వద్ద గట్టిగా వాదించారట! దీంతో అధిష్టానం కూడా ఆలోచనలో పడి ఏ నిర్ణయమూ తీసుకోలేకపోయిందట.

అయితే మారిన రాజకీయ పరిస్థితులలో బీజేపీలో చేరాలని గంటా శ్రీనివాసరావు డిసైడ్‌ అయినట్టుగా ఆయన సన్నిహితవర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఆయన జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయి బీజేసీ నేతలతో మంతనాలు కూడా జరిపారట. సమీప రోజుల్లోనే ఆయన సైకిల్ దిగడం ఖాయమని విశాఖలో వార్తలు గుప్పుమంటున్నాయి.
 
గంటా రాకను వైసీపీలో చాలామంది వ్యతిరేకిస్తుంటే.. కమలం పార్టీలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి ఉందట! ఆయన రాకను నగరంలో మెజారిటీ బీజేపీ నేతలు స్వాగతిస్తున్నారట. ఇప్పటికే ఢిల్లీ బీజేపీ పెద్దలతో గంటా శ్రీనివాసరావు ఒక దఫా చర్చలను పూర్తి చేశారట!

గంటాతోపాటు పలువురు టీడీపీ నేతలు కూడా పార్టీ మారే అవకాశం ఉందట! ప్రజారాజ్యం పార్టీలో గంటా ఉన్నప్పుడు నగరంలో చాలామంది నేతలు ఆయనకు సన్నిహితులుగా ఉన్నారు. ఇప్పుడు కూడా వారు ఆయన వెన్నంటే ఉన్నారు. ఒకవేళ టీడీపీని గంటా వీడితే.. ఎవరెవరు ఆయనను అనుసరిస్తారు అన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్‌గానే ఉంది.

బీజేపీలో గంటా శ్రీనివాసరావు చేరతారన్న అంశాన్ని ఆ పార్టీ నేతల వద్ద ప్రస్తావిస్తే.. "అవును.. కొంతమంది టీడీపీ నేతలు మా పార్టీలోకి రావడానికి ఆసక్తి చూపుతున్నారు'' అని బదులిస్తున్నారు. "ఎవరెవరు చేరబోతున్నారు?'' అని అడిగితే మాత్రం "ఆ ఒక్కటీ అడగొద్దు'' అని సమాధానం దాటవేస్తున్నారు.
 
ఇదిలా ఉంటే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని దెబ్బతీయడానికి ఆ పార్టీ నేతలను లక్ష్యంగా చేసుకొని అధికార వైసీపీ పావులు కదుపుతోంది. అయితే ఏపీలో వైసీపీ నుంచి ఎదురవుతున్న సవాళ్లును తట్టుకుని నిలబడాలంటే బీజేపీలో చేరడం మంచిదనే అభిప్రాయానికి చాలామంది నేతలు వచ్చేశారు.

తమకు రాజకీయ రక్షణ కోసం విశాఖ టీడీపీకి చెందిన కొంతమంది నేతలు బీజేపీ వైపు చూస్తున్నారనే విశ్లేషణలు కూడా వస్తున్నాయి. అయితే ఇప్పటివరకు ఒక్కరు కూడా "తాము టీడీపీని వీడి బీజేపీలోకి వెళుతున్నామని'' బహిరంగంగా చెప్పడంలేదు. అలా అని వలసపై వస్తున్న వార్తలను సైతం వారు ఖండించడం లేదు. దీంతో టీడీపీని వీడేది ఎవరు? అన్న ఉత్కంఠకి మాత్రం ఇప్పట్లో తెరపడేలా కనిపించడం లేదు.