శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 27 ఫిబ్రవరి 2015 (15:14 IST)

చెత్త ఆలోచనపై హైకోర్టు సీరియస్: గంటలోగా చెత్త డబ్బాలు తొలగించండి!

ఆస్తి పన్ను వసూళ్ల కోసం గ్రేటర్ హైదరాబాదు మునిసిపల్ కార్పొరేషన్ ఎంచుకున్న మార్గంపై హైకోర్టు సీరియస్ అయ్యింది. పన్ను వసూళ్ల కోసం ఇళ్లు, కార్యాలయాల ముందు చెత్త డబ్బాలు పెట్టడం ద్వారా పన్ను బకాయిదారులను జీహెచ్ఎంసీ దారిలోకి తెచ్చుకోవాలని యత్నించింది. ఈ యత్నం మొదట్లో మంచి ఫలితాలనే ఇచ్చినా, ఆ తర్వాత బెడిసికొట్టింది. చెత్త డబ్బాలు చూసి బకాయిలు వసూలవుతాయనుకున్న జీహెచ్ఎంసీ అధికారులపై బకాయిదారులు కోర్టుకెక్కారు. 
 
ఈ పిటిషన్‌ను కొద్దిసేపటి క్రితం విచారించిన హైకోర్టు, జీహెచ్ఎంసీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. గంటలోగా బకాయిదారుల ఇళ్లముందు పెట్టిన చెత్త డబ్బాలను తీసేయాలని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాక పన్ను వసూళ్ల కోసం ప్రత్యామ్నాయ మార్గాలుండగా, ఈ మార్గాన్నే ఎందుకు ఎంచుకున్నారని నిలదీసింది. చెత్త డబ్బాలు తొలగించకపోతే కమిషనర్, అధికారులపై చర్యలకు ఆదేశిస్తామని ఉన్నత న్యాయస్థానం హెచ్చరించింది. హైకోర్టు మొట్టికాయలతో రంగంలోకి దిగిన అధికారులు చెత్త డబ్బాలను తొలగించే పనిని ప్రారంభించారు.