శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 2 సెప్టెంబరు 2019 (19:25 IST)

కొబ్బరి తోటల రైతులకు శుభవార్త

వినాయక చవితి పర్వదినాన ప్రభుత్వం కొబ్బరి రైతులకు తీపి కబురు అందించింది. వారికి అన్ని విధాల అండ దండగా ఉంటూ వరాలు ప్రకటించింది. కొబ్బరి తోటల సాగును ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేస్తూ, ఆ రైతులకు ఆర్థిక సహాయం చేయనున్నారు.

ఈ ప్రక్రియలో భాగంగా ఒక్కో హెక్టారు తోటకు మూడేళ్లలో రైతుకు దాదాపు రూ.2.80 లక్షల సహాయం అందుతుంది. అదే విధంగా వైయస్సార్‌ పథకంలో పంటల బీమా ప్రీమియమ్‌లో కూడా కొబ్బరి రైతులకు 75 శాతం రాయితీ లభించనుంది.

ఇంకా కొబ్బరి పరిశోధనా కేంద్రం ఏర్పాటుతో పాటు, రైతు క్షేత్రంలోనే పరిశోధలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది.
 ఇవాళ కాకినాడలో మీడియాతో మాట్లాడిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, ఈ మేరకు పూర్తి వివరాలు వెల్లడించారు.

రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేస్తున్న ప్రభుత్వం కొబ్బరి పంటకు కూడా ప్రోత్సాహం అందించాలని నిర్ణయించిందని మంత్రి తెలిపారు.

ఉభయ గోదావరి జిల్లాలు, శ్రీకాకుళం జిల్లా ఉద్ధానం, విజయనగరం, నెల్లూరు జిల్లాలలో కొబ్బరి తోటలు, సాగు ఎక్కువని, అయితే చాలా కాలంగా చెట్లకు తెగులు సోకడం వల్ల దిగుబడి పడిపోయిందని, దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని కొబ్బరి బోర్డు అనుసంధానంతో ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని మంత్రి పేర్కొన్నారు. 

రీ ప్లాంటింగ్‌ అండ్‌ రీజనరేషన్‌ తోటలు పాడైన చోట తిరిగి వాటిని వేసుకోవడం.. పాత చెట్లు తొలగించి, కొత్తగా మొక్కలు నాటి పెంచడం. అదే విధంగా రీజనరేషన్‌.. తెగుళ్లు వంటి వాటిని నివారించి, ఆ మొక్కలు తిరిగి పెంచడం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక పథకం ప్రవేశపెడుతోందని మంత్రి కన్నబాబు వెల్లడించారు.

దీనికి ఆర్థిక సహాయం కూడా అందజేస్తామని తెలిపారు. ఉపాధి హామీ పథకంతో అనుసంధానం కొబ్బరి తోటల సాగును ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేస్తామని మంత్రి చెప్పారు. వాస్తవానికి దీనికి కేంద్ర ప్రభుత్వం గత ఏడాది అనుమతి ఇచ్చినా చేపట్టలేకపోయారని తెలిపారు.

రైతులకు అవగాహన లేకపోవడంతో పాటు, అప్పటి ప్రభుత్వం దాని మీద శ్రద్ధ పెట్టకపోవడం వల్ల ఇవాళ ఈ పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ‘ఉపాధి హామీ పథకంలో కొబ్బరి తోటలు వేసుకునే రైతులకు సహాయం చేయాలని నిర్ణయించాము.

ఈ ప్రక్రియలో ఒక హెక్టారు (2.5 ఎకరాలు)కు రూ.2,79,770 మూడేళ్లలో ఉపాధి హామీ పథకం కింద ఇస్తారు. అందులో వేజ్‌ కాంపోనెంట్‌ (కూలీ చెల్లింపు) కింద 822 పని దినాలు లెక్కించి రూ.1,73,591, ఇంకా మెటేరియల్‌ కాంపోనెంట్‌ కింద రూ.1,06,179 చెల్లిస్తారు.

అంటే తొలి ఏడాది దాదాపు రూ.1.08 లక్షలు, రెండో ఏడాది రూ.85 వేలు, మూడో ఏడాది రూ.52 వేలు అందిస్తాము. దీని వల్ల కొబ్బరి రైతులకు ఎంతో మేలు జరుగుతుంది’ అని మంత్రి కన్నబాబు వివరించారు. ‘దీంతో పాటు, వైయస్సార్‌ ఉచిత పంటల బీమా కింద కూడా చేయూతనిస్తాము.

కొబ్బరి పంటల బీమా ప్రీమియమ్‌లో 75 శాతం మొత్తాన్ని కొబ్బరి బోర్డుతో కలిసి ప్రభుత్వం చెల్లిస్తుంది. 4 ఏళ్ల నుంచి 15 ఏళ్ల వయసు ఉండే మొక్కలకు రూ.9, 16 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయస్సు ఉన్న మొక్కకు రూ.14 చొప్పున ప్రీమియమ్‌ చెల్లించాలి. ఇందులో 75 శాతం మొత్తాన్ని ప్రభుత్వంతో పాటు, కొబ్బరి బోర్డు భరిస్తుంది’ అని మంత్రి వెల్లడించారు.
 
కొబ్బరి ధరలకు ప్రోత్సాహం ఇచ్చే విధంగా నాఫెడ్‌ సహకారంతో తూ.గో. జిల్లాలో 5 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, వాటిలో మార్కెట్‌ సెస్‌ కూడా రద్దు చేశామని వ్యవసాయ మంత్రి తెలిపారు. దీని వల్ల కొబ్బరి రైతులకు మంచి ధర వచ్చిందంటూ, ఆ వివరాలు చెప్పారు.

 ‘గతంలో క్వింటాలు కొబ్బరికి రూ.6 వేలు పలకగా, ఇప్పుడు రూ.8,500 వేలకు పెరిగింది. ఇక గరిష్ట చిల్లర ధర (ఎమ్మెస్పీ) దాదాపు రూ.9,900 ఉంది. అంటే ప్రభుత్వ చర్యల వల్ల రైతులకు గిట్టుబాటు ధర దాదాపు రెండు వేలకు పైగా ధర పెరిగింది’ అని మంత్రి కన్నబాబు వివరించారు.

కొబ్బరి సాగుకు ప్రోత్సాహం
ఎక్కడైనా మార్కెట్‌లో ధర పడిపోతే వెంటనే జోక్యం చేసుకోవాలన్నది ప్రభుత్వ లక్ష్యమని మంత్రి చెప్పారు. ఇంకా గతంలో మాదిరిగా గట్ల మీద కొబ్బరి మొక్కలు నాటేలా ప్రత్యేక కార్యక్రమం చేపడతామని, ఈ ప్రక్రియలో రైతులకు తగిన ప్రోత్సాహం అందిస్తామని వెల్లడించారు. 

కొబ్బరి పరిశోధనా కేంద్రం
కొబ్బరికి మరింత చేయూతనిచ్చే విధంగా సెంట్రల్‌ రీసెర్చ్‌ స్టేషన్‌ (సీపీసీఆర్‌ఐ) ఆధ్వర్యంలో జిల్లాలో కొబ్బరి పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. దీన్ని సామర్లకోటలో ఏర్పాటు చేయాలని గతంలో ప్రతిపాదించారన్న ఆయన, త్వరలోనే ఏర్పాటుకు తగిన చర్యలు చేపడతామని చెప్పారు.

అదే విధంగా ఆన్‌ఫామ్‌ రీసెర్చ్‌ స్టేషన్‌.. అంటే రైతు క్షేత్రం (భూమి) లోనే శాస్త్రవేత్తలు రీసెర్చ్‌ చేపడతారని, త్వరలోనే ఈ విధానం కూడా అమలు చేయబోతున్నామని మంత్రి కన్నబాబు వివరించారు.