తెలుగు భాషాభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి
కరోనా విపత్కర పరస్థితులలో సైతం అధికార భాషా సంఘం తనదైన పనితీరును ప్రదర్శించటం ముదావహమని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. విస్తృత స్థాయి పర్యటనలు, సమీక్షలతో తెలుగు భాష ఉన్నతికి చేస్తున్న కృషి ఎనదగినదని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షుడు అచార్య యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ సిఎం క్యాంపు కార్యాలయంలో బుధవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో సంస్థ వార్షిక నివేదికను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అందించారు.
గత సంవత్సర కాలంలో అధికార భాషా సంఘం చేపట్టిన విభిన్న కార్యాక్రమాలను నివేదికలో వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ తెలుగు భాషాభివృద్దికి ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహాకారాలు అందిస్తుందన్నారు. ఆచార్య యార్లగడ్డ మాట్లాడుతూ గత సంవత్సర కాలంలో అన్ని జిల్లాల పాలనాధికారులతోనూ, రాష్ట్ర స్థాయి సంచాలకులతోనూ సమావేశాలు జరిపి ప్రభుత్వ కార్యాలయాలలో తెలుగు అమలు తీరును సమీక్షించామన్నారు.
నిర్ధిష్ట ప్రశ్నావళి ఆధారంగా ఆయా ప్రభుత్వ కార్యాలయాలలోని దస్త్రాలను పరిశీలించి తెలుగు వినియోగం సక్రమంగా లేని కార్యాలయాలకు తగిన సూచనలు చేసామన్నారు. నిజానికి గత ప్రభుత్వ కాలంలో అధికార భాషాసంఘాన్ని నిర్వీర్యం చేసారని, కనీస అస్తిత్వమే కరువైందని ఆచార్య యార్లగడ్డ పేర్కొన్నారు. వార్షిక నివేదిక సమర్పణ కార్యాక్రమంలో అధికార భాషా సంఘం సభ్యులు మోదుగుల పాపిరెడ్డి, షేక్ మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 5 లక్షలు
కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం తరుపున ముఖ్యమంత్రి సహాయ నిధికి సంఘం అధ్యక్షుడు ఆచార్య యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ రూ. 5 లక్షల చెక్కును స్వయంగా సిఎం జగన్ మోహన్ రెడ్డికి అందించారు. సేవా దృక్పధంతో ముఖ్యమంత్రి సహాయ నిధికి నిధులు సమకూర్చటం ముదావహమని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి యార్లగడ్డను అభినందించారు.