కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవేంకటేశ్వరుని పట్టపుదేవేరి అయిన శ్రీ పద్మావతి అమ్మవారు అవతరించిన పంచమి తిథిని పురస్కరించుకుని కార్తీక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన ఆదివారం పంచమీ తీర్థం(చక్రస్నానం) అశేష భక్తజనవాహిని మధ్య రంగరంగ వైభవంగా జరిగింది.
ఉదయం 6.30 గంటల నుండి 8 గంటల వరకు పద్మావతి అమ్మవారు పల్లకీలో ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించారు. అనంతరం అమ్మవారికి ఆస్థానం నిర్వహించి ఉత్సవర్లను ఊరేగింపుగా పంచమీ తీర్థ మండపానికి వేంచేపు చేశారు. తిరుమల శ్రీవారి ఆలయం వద్ద తెల్లవారుజామున 4.30 గంటలకు బయలుదేరిన సారె ఉదయం 11 గంటలకు తిరుచానూరు అమ్మవారి ఆలయానికి చేరుకుంది.
పంచమీ తీర్థ మండపంలో సారెను అమ్మవారికి సమర్పించి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఒక కిలో 300 గ్రాములు బరువుగల వజ్రాలు పొదిగిన అష్టలక్ష్మీ స్వర్ణ వడ్డాణాన్నిసారెతో పాటు తిరుపతి పురవీధులలో ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారికి అలంకరించారు.
శోభాయమానంగా స్నపనతిరుమంజనం...
పంచమీ తీర్థ మండపంలో అమ్మవారికి, చక్రత్తాళ్వార్‌కు ఉదయం 10 గంటల నుండి 11.30 గంటల వరకు వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీళ్లతో విశేషంగా అభిషేకం చేశారు. ఈ సందర్భంగా అమ్మవారికి అలంకరించిన పూలమాలలు, కిరీటాలు భక్తులకు కనువిందు చేశాయి. ఎండు ద్రాక్ష, కొబ్బరి పూలు, ఎండుఫలాలు, పవిత్రాలతో మాలలు రూపొందించారు.
తులసి గింజలు, పవిత్రాలతో చేసిన మాలలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తమిళనాడులోని తిరుపూర్‌కు చెందిన రాజేంద్ర, షణ్ముగ సుందరం, సుబ్రమణ్యం, నెల్లూరుకు చెందిన నరహరి మాలల తయారీకి విరాళం అందించారు. మధ్యాహ్నం 12.15 గంటలకు కుంభ లగ్నంలో పంచమీ తీర్థం(చక్రస్నానం) ఘట్టం ఘనంగా జరిగింది. చక్రత్తాళ్వార్‌తో పాటు పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తజనం పుణ్యస్నానాలు ఆచరించారు. రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు బంగారు తిరుచ్చి వాహనంలో అమ్మవారి ఉత్సవర్లను ఊరేగింపు నిర్వహించారు.
అనంతరం రాత్రి 9.30 నుండి 10.30 గంటల వరకు శాస్త్రోక్తంగా ధ్వజావరోహణం జరిగింది. కార్యక్రమంలో పెద్ద జీయ్యంగార్, చిన్న జీయ్యంగార్, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, టిటిడి ఛైర్మన్ వైవి.సుబ్బారెడ్డి, ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, బోర్డు సభ్యులు, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, బోర్డు సభ్యులు వి.ప్రశాంతి, శివకుమార్, అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి, తిరుపతి జెఈవో పి.బసంత్‌కుమార్, సివిఎస్‌వో గోపినాధ్ జెట్టి, తిరుపతి అర్బన్ ఎస్పీ గజరావ్ భూపాల్, అదనపు సివిఎస్‌వో శివకుమార్‌రెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో గోవిందరాజన్ ఇతర ఉన్నతాధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
నేడు పుష్పయాగం...
సోమవారం ఆలయంలో పుష్పయాగం సాయంత్రం 5 నుండి 8 గంటల వరకు వైభవంగా జరుగనుంది. ఈ సందర్భంగా కల్యాణోత్సవం, ఊంజల్‌సేవలను టిటిడి రద్దు చేసింది. రూ.500 టికెట్ కొనుగోలు చేసి గృహస్తులు(ఇద్దరు) పుష్పయాగంలో పాల్గొనవచ్చు.