గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 7 నవంబరు 2020 (08:55 IST)

గ్రామ సచివాలయాల ద్వారా గొప్ప సేవలు: అజ‌య్‌జైన్‌

గ్రామ సచివాలయాల ద్వారా సిబ్బంది ప్రజలకు గొప్ప సేవలందించడంలో భాగస్వామ్యం కావడం సంతోషదాయకమని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్ పేర్కొన్నారు.

గుంటూరు జిల్లా వడ్డేశ్వరంలోని కె.ఎల్.విశ్వవిద్యాలయంలోని పీకాక్ ఆడిటోరియంలో నిర్వ‌హించిన కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల "గ్రామ సచివాలయాల మాస్టర్ ట్రైనర్ల శిక్షణా కార్యక్రమంలో అజయ్‌జైన్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. 

ఈ సందర్భంగా అజ‌య్‌జైన్ మాట్లాడుతూ గ్రామ సచివాలయాల సిబ్బంది నిరంతరం నేర్చుకుంటూనే వుండాలన్నారు. ప్రభుత్వంలో పని చేయాలన్న తపనతో గ్రామ సచివాలయ శాఖలో ఉద్యోగాలు సాధించడం గొప్ప విషయ‌మ‌న్నారు.

ఈ సంవత్సర కాలంలో సచివాలయ సిబ్బంది చేసిన కృషి వల్ల, కేవలం ఎనిమిది నెలల కాలంలో కోటి సేవలు ప్రజలకు అందించి చరిత్ర సృష్టించారు అని ముఖ్య కార్యదర్శి కొనియాడారు. త‌క్కువ సమయంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆశించిన స్థాయిలో గ్రామ సచివాలయ వ్యవస్థను బలోపేతం చేయడంలో సిబ్బంది పాత్ర ప్రశంసనీయమన్నారు.

ప్రజలతో మమేకమై పనిచేయాలన్నారు. మంచి మాటలతో, చక్కని ప్రవర్తన తో ప్రజల మనసులను గెలవాలన్నారు. ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించకుండా, ప్రవర్తన కలిగి వుండి, పని తీరు పెంచుకోవాలన్నారు. ప్రవర్తన నియమావళి గురించి డివిజన్ స్థాయిలో జాయింట్ డైరెక్టర్ మొగిలిచెండు సురేష్‌ ద్వారా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

క్రమశిక్షణ, సమయపాలన, ప్రజలతో మర్యాదపూర్వకంగా మెలగడం వంటి ప్రవర్తనా నైపుణ్యాలు మెండుగా కలిగి వుండి, ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేసి, శాఖకు, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకు రావాలని ఉద్భోదించారు.

పనితీరు, ప్రవర్తన, ప్రగతి ప్రొబేషన్‌కు అత్యంత ముఖ్యమైన అంశాలు అన్నారు. ఈ ప్రొబేషన్ కాలంలో చాలా జాగ్రత్తగా పని తీరును పెంచుకోవాలని,  ప్రగతిని సాధించాలని, సత్పవర్తనతో  మెలగాలని, ప్రైవేటు మీ సేవా కేంద్రాలతో  పోటీ పడి, ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు. 

ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేకానేక పథకాలు, సేవల గురించి అవగాహన పెంచుకోవాలన్నారు. ఇతర సిబ్బందికి కూడా అన్ని విషయాలపై అవగాహన పెంచాలన్నారు. శిక్షణా కార్యక్రమంలో నేర్చుకున్న అంశాలపై మూల్యాంకనం జరుగుతుందని తెలిపారు. 

పెరుగుతున్న సమాచార సాంకేతికపై  డిజిటల్ సహాయకులు పట్టు కలిగి వుండాలి. నూతన సాంకేతికతను అందిపుచ్చుకుంటూ అమలు చేయడంలోనూ మాస్టర్ ట్రైనర్లు ముందడుగులో వుండాలన్నారు. జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, రాష్ట్ర స్థాయి అధికారులు గ్రామ సచివాలయాల సందర్శన చేయనున్నందున, గ్రామ సచివాలయాల నిర్వహణను, సేవల వితరణను మెరుగుపరుచుకోవాలన్నారు.

ప్రభుత్వం ఇచ్చిన కంప్యూటర్లు, ప్రింటర్లు, లామినేటింగు యంత్రాలు వంటి కార్యాలయ సామాగ్రి నిర్వహణ లో జాగరూకత, అప్రమత్తత అవసరం అన్నారు. నిరంతరం నేర్చుకోవడం ద్వారా, అనునిత్యం నేర్చుకున్నవాటిని అమలు చేయడం ద్వారానే ప్రభుత్వ ఉద్యోగులు రాణిస్తారని అజయ్ జైన్ విశదీకరించారు. ఈ సందర్భంగా అజయ్ జైన్‌కు శిక్షణార్థులు ఘన సన్మానించారు.

కార్యక్రమంలో జాయింట్ కమిషనరు రామనాథరెడ్డి, కె.ఎల్.విశ్వవిద్యాలయ ప్రతినిధి సుబ్రమణ్యం, గ్రామ సచివాలయ శాఖ సిబ్బంది బాజీద్, నాగేశ్వరరావు, రమణ, కేశవరావు పాల్గొన్నారు.