శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 22 మే 2020 (08:32 IST)

గుంటూరు జిల్లాలో వ్యాపారాలకు గ్రీన్ సిగ్నల్

గుంటూరు జిల్లాలో కంటైన్‌మెంట్‌ జోన్లలో మినహా నాన్‌ కంటైన్‌మెంట్‌ ప్రాంతాల్లో  ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకొని వ్యాపారాలు నిర్వహించకోవచ్చని జిల్లా కలెక్టర్‌ ఐ శామ్యూల్‌ ఆనంద్‌ కుమార్‌ తెలిపారు. 
 
కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్‌ శంకరన్‌ హాలులో జిల్లా కలెక్టర్‌ ఐ శామ్యూల్‌ ఆనంద్‌ కుమార్, గుంటూరు అర్బన్‌ జిల్లా ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ, రూరల్‌ జిల్లా ఎస్పీ విజయరావుతో కలిసి ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రతినిధులు, వివిధ ట్రేడర్స్‌ అసోసియేషన్‌ నాయకులతో సమావేశం నిర్వహించారు. 
 
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ..  కేంద్ర హోం శాఖ, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన నూతన నిబంధనల ప్రకారం కంటైన్‌మెంట్‌ క్లస్టర్లు, కంటైన్‌మెంట్‌ బఫర్‌ జోన్లలో దుకాణాలు తెరవటానికి వీలు లేదన్నారు.

పాజిటివ్‌ కేసు నమోదు అయిన ప్రాంతం నుంచి 500 మీటర్లు వరకు కంటైన్‌మెంట్‌ క్లస్టర్, తరువాత 500 మీటర్లు కంటైన్‌మెంట్‌ బఫర్‌ జోన్‌ కలిపి మొత్తం కేసు నమోదైన ప్రాంతం నుంచి కిలోమీటరు  వరకు కంటైన్‌మెంట్‌ జోన్‌ ఉంటుందన్నారు.

జిల్లాలో నమోదైన కేసుల ప్రకారం గుంటూరు, నర్సరావుపేట, తాడేపల్లి పట్టణాలు పూర్తిగా కంటైన్‌మెంట్‌ జోన్లలో ఉన్నాయన్నారు. ఇక్కడ గతంలో మాదిరిగా ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు నిత్యావసర దుకాణాలకు మాత్రమే మినహాయింపు ఉంటుందన్నారు.

సమావేశంలో వ్యాపారవర్గాల కోరిన మీదట శుక్రవారం నుంచి కంటైన్‌మెంట్‌ ప్రాంతాల్లో మినహాయింపు సమయం ఉదయం 6 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు ఒక గంట పొడిగిస్తున్నామన్నారు. మాచర్ల, మంగళగిరి, తెనాలి, పిడుగురాళ్ళ, పొన్నూరు, చిలకలూరిపేట, సత్తెనపల్లి, దాచేపల్లి మున్సిపాలిటీలలో, కర్లపాలెం, పెదకాకాని, మాచర్ల రూరల్, తాడేపల్లి రూరల్, ఈపూరు, గుంటూరు రూరల్‌ మండలాల్లోని కొన్ని ప్రాంతాల్లో కంటైన్‌మెంట్‌ జోన్‌లు ఉన్నాయన్నారు. 
 
రేపల్లే, బాపట్ల, వినుకొండ మున్సిపాలీటీలు, మిగతా ఇతర మండలాలు నాన్‌ కంటైన్‌మెంట్‌ జోన్‌లో ఉన్నాయన్నారు. నాన్‌ కంటైన్‌మెంట్‌ జోన్‌లో చెప్పులు, గార్మెంట్స్, జ్యూయలరీ షాపులు మినహా అన్ని దుకాణాలు నిబంధనలు పాటిస్తూ  ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7గంటల వరకు తెరుచుకునే వీలుందన్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ప్రతి దుకాణంలో వెలుపల, లోపల  కనీసం దూరం ఆరు అడుగులు ఉండేలా మార్కింగ్‌ చేయాలి. దుకాణాలను 50శాతం మంది ఉద్యోగులతోనే నిర్వహించాలి. 
 
కొనుగోలుదారులను దుకాణాల్లోకి అనుమతించకుండా ఉద్యోగులె  సరుకులను వెలుపలికి తెచ్చి అందించాలి.  కొనుగోలుదారులు, ఉద్యోగులు ప్రతి ఒక్కరు మాస్క్‌లు ధరించాలని, మాస్క్‌లు ధరించకుండా వచ్చిన వారిని అనుమతించరాదని, వారికి సరుకులు అమ్మరాదన్నారు. ప్రతి దుకాణం వద్ద ప్రజలకు కన్పించేలా నో మాస్క్, నో సేల్స్, నో ఎంట్రీ అని బోర్డులు ప్రదర్శించాలన్నారు.

దుకాణంలోని ఫ్లోరింగ్, తరుచు టచ్‌ చేసే డోర్‌ నాబ్స్, ఉపరితలాలు తరుచు శానిటైజేషన్‌ చేయాలి. టాయిలెట్స్‌లో టిష్యూపేపర్లు, శానిటైజర్లు, సబ్బులు, రన్నింగ్‌ వాటర్‌ ఏర్పాటు చేసి తరుచు శుభ్రపరుస్తు ఉండాలి. దుకాణంలోని ఉద్యోగులకు కరోనా వైరస్‌ అనుమానిత లక్షణాలు ఉంటే వారిని వెంటనే ఆసుపత్రులకు పంపాలి. ఉద్యోగులు, కొనుగోలుదారులు  ఆరోగ్య సేతు యాప్‌ ను స్మార్ట్‌ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకునేలా చర్యలు తీసుకోవాలి.

కరోనా వైరస్‌ నివారణకు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై దుకాణాల వద్ద పోస్టర్లు ఏర్పాటు చేయాలి. సెలున్‌ షాపులకు సంబంధించి ప్రత్యేక ఎస్‌ఓపీ తప్పనిసరిగా పాటించాలన్నారు. సెలున్‌ షాపులకు వచ్చేవారి పూర్తి వివరాలు నమోదు చేసుకోని వారి టెంపరేచర్‌ చెక్‌ చేయాలన్నారు. క్రాప్‌ చేసేవారు పూర్తిగా పీపీఈలు, హ్యాండ్‌ గ్లౌజ్‌లు ధరించి, పరికరాలన్ని  శానిటైజేషన్‌ చేసి వినియోగించాలన్నారు.

దుకాణాల వద్ద కొనుగోలుదారులు సామాజిక దూరం పాటించటం, ఇతర నిబంధలు అమలు చేయటం యజమానులే పూర్తి బాధ్యత తీసుకోవాలని, నిబంధనలు పాటించని దుకాణాలను మూసివేయటం జరుగుతుందన్నారు. నాన్‌ కంటైన్‌మెంట్‌ జోన్లలో సైతం సినిమా హాల్స్, మాల్స్, జిమ్, రెస్టారెంట్, హోటల్స్, స్విమ్మింగ్‌ పూల్స్, స్టేడియాలు తెరవటానికి వీలు లేదన్నారు. టేక్‌ ఏ వే హోటల్స్‌లో కిచన్స్‌ తెరవటానికి అనుమతి ఉందన్నారు.

గుంటూరు నగరంలోని పట్నంబజారు కంటైన్‌మెంట్‌ జోన్‌ పరిధిలో ఉన్నందున ఫర్టిలైజర్స్, పురుగుమందులు, విత్తనాల దుకాణదారులు నాన్‌ కంటైన్‌మెంట్‌ మండలాల్లో, వ్యవసాయ మార్కెట్ట్‌లలో సబ్‌ సెంటరు ఏర్పాటు చేసుకునేందుకు ప్రతిపాదనలు అందిస్తే రాష్ట్ర వ్యవసాయశాఖ అధికారులతో మాట్లాడి అనుమతులు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు.

కరోనా వైరస్‌ విపత్కర పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలను ఆదుకోవటానికి వ్యాపార వర్గాలు అందించిన సహాయం అబినందనీయం అన్నారు. జిల్లాలో గుంటూరు,నర్సరావుపేట కంటైన్‌మెంట్‌ క్లస్టర్లలో రోజువారీ కూలీ చేసుకొనే కుంటుంబాలు లాక్‌డౌన్‌ వలన వెలుపలకు రాలేక ఇబ్బందులు పడుతున్నారని వారికి నిత్యావసర సరుకులు పంపిణీకి వ్యాపార వర్గాలు తమ వంతు సహకారం అందించాలన్నారు.

గుంటూరు జిల్లా అర్బన్‌ ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ మాట్లాడుతూ గుంటూరు, నర్సరావుపేట, తాడేపల్లిలో యధవిధిగా లాక్‌డౌన్‌ అమలు జరుగుతుందని కేవలం ఉదయం మాత్రమే నిత్యవసర సరుకులు కొనుగోలుకు అనుమతి ఉంటుందన్నారు. సంయుక్త కలెక్టర్‌(రెవెన్యూ, వ్యవసాయం) ఏఎస్‌ దినేష్‌ కుమార్‌ మాట్లాడుతూ కరోనా వైరస్‌ కష్టకాలంలో సైతం కంటైన్‌మెంట్‌ క్లస్టర్లలో ప్రజలకు అవసరమైన నిత్యావసర సరుకులు వారి ఇంటిముందుకు అందించేందుకు సహకరించిన వ్యాపారస్తులకు ప్రత్యేక ధన్యావాదాలు తెలుపుతున్నామన్నారు. 
 
కంటైన్‌మెంట్, నాన్‌ కంటైన్‌మెంట్‌ జోన్లకు సంబంధించి, వ్యాపారాల నిర్వహణలో పాటించాల్సిన నిబంధనలు తదితర సమస్యలపై సహాయం అందించేందుకు సివిల్‌ సప్లయిస్‌ కార్యాలయంలో కాల్‌ సెంటరును ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి అరికట్టేందుకు ప్రభుత్వం సూచించిన నిబంధనలు ప్రతి ఒక్క వ్యాపారస్తులు పాటిస్తూ అధికారులకు సహకరించాలన్నారు.

ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఆధ్యక్షులు ఆతుకూరి ఆంజనేయులు మాట్లాడుతూ గుంటూరు నగరంతో పాటు, కంటైన్‌మెంట్‌ జోన్లలో ఇబ్బంది లేని ప్రాంతాల్లో ఇతర దుకాణాలు తెరవటానికి అవకాశం కల్పించాలన్నారు. కనీసం నిత్యావసర సరుకులు మినహాయింపు ఇచ్చిన సమయంను ఉదయం 11 గంటల వరకు పొడిగించాలన్నారు.

ఏపీ టెక్స్‌టైల్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు బూసిరెడ్డి మల్లేశ్వరరెడ్డి మాట్లాడుతూ లాక్‌డౌన్‌ వలన వస్త్రవ్యాపార సంస్థలు తీవ్రంగా నష్టపోయాయని, నాన్‌ కంటైన్‌మెంట్‌ జోన్లలో వస్త్రదుకాణాలు తెరుచుకునేందుకు అవకాశం కల్పించాలన్నారు.

సమావేశంలో నగరపాలక సంస్థ కమిషనర్‌ చల్లా అనురాధ, మున్సిపల్‌ ఆర్డీ వెంకటేశ్వర్లు, నర్సరావుపేట, తెనాలి ఛాంబర్ ఆఫ్‌ కామర్స్‌ ప్రతినిధులు, డాల్‌మిల్స్, కిరాణా, హార్డ్‌వేర్, ఎలక్ట్రికల్స్, ఫ్యాన్సీ మర్చంట్స్, ఫర్టిలైజర్స్, స్టీల్, జ్యూయలరీ, అసోసియేషన్‌ నాయకులు తదితరులు  పాల్గొన్నారు.