గుడివాడ క్యాసినో అంశంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన టీడీపీ
సంక్రాంతి సంబరాల్లో భాగంగా రాష్ట్ర మంత్రి కొడాలి నాని సొంత నియోజకవర్గమైన గుడివాడలో నిర్వహించిన గోవా క్యాసినో వ్యవహారాన్ని రాష్ట్ర గవర్నర్ హరిచందన్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ గురువారం గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేసింది.
ఇదే అంశంపై ఆ పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్య మాట్లాడుతూ, క్యాసినో నిర్వహణ అంశంపై డీజీపీ, జిల్లా కలెక్టర్లకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈ ప్రభుత్వానికే కాదు ప్రభుత్వ అధికారులకు కూడా చెవులు, కళ్లు పని చేయడం లేదన్నారు.
మంత్రి కొడాలి నానిని రక్షించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సహా అధికార యంత్రాంగం మొత్తం తపనపడుతున్నారని, ఇక చేసేది లేక తాము గవర్నర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. అయితే, గవర్నర్ అనారోగ్యంగా ఉండటంతో ఆయన కార్యదర్శి సిసోడియాకు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు.
సంక్రాంతి తర్వాత కొడాలి నాని కాస్త క్యాసినో నానిగా మారారన్నారు. రూ.10 వేలు ఫీజుతో క్యాసినో ఏర్పాటు చేశారని చెప్పారు. తద్వారా రాష్ట్రంలో విష సంస్కృతికి తెరలేపారని చెప్పారు. గుడివాడలో జరిగిన గోవా క్యాసినో ప్రపంచం మొత్తం చూసినా సీఎ జగన్‌తో పాటు.. వైకాపా నేతలు చూడలేక పోవడంతో విచిత్రంగా ఉందని ఆయన అన్నారు.