కోవిడ్ మార్గదర్శకాలకు లోబడే వినాయక చవితి వేడుకలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్ మార్గదర్శకాలకు లోబడే వినాయక చవితి వేడుకలు జరుపుకోనున్నారు. కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించే వినాయక చవితి సంబరాల నిర్వహణపై ఆంక్షలు విధించామని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది.
అయితే, ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని పెద్ద ఎత్తున విమర్శించారు. ఈ విమర్శలకు బీజేపీ శ్రీకారం చుడితే, టీడీపీ, జనసేన కూడా అందుకున్నాయి. అదేసమయంలో జగన్ క్రిస్టియానిటీని తెరపైకి తెచ్చారు.
ఈ క్రమంలో వినాయక చవితి సంబరాలపై చివరికి కోర్టును కూడా ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పు ప్రతిపక్షాల చెంప ఛెళ్లుమనిపించేలా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బహిరంగ ప్రదేశాల్లో వినాయకుడి విగ్రహాలు, మండపాల ఏర్పాటుకు అనుమతించలేమని హైకోర్టు స్పష్టం చేసింది.
కోవిడ్ నియంత్రణలో భాగంగా ప్రభుత్వం విధించిన ఆంక్షలు సమర్థనీయమేనని, ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం తేల్చి చెప్పింది.
బహిరంగ ప్రదేశాల్లో వినాయక విగ్రహాలు పెట్టుకోవడానికి నిరాకరిస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను సవాల్ చేస్తూ న్యాయవాది, విశ్వహిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి సిద్ధినేని శ్రీసత్యసాయిబాబు వేసిన పిల్‌ను హైకోర్టు కొట్టి వేసింది.