1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 22 ఏప్రియల్ 2020 (18:48 IST)

చిలకలూరి పేటలో తొలి కరోనా... వైద్యురాలికి సోకిన వైరస్

గుంటూరు జిల్లా చిలకలూరి పేటలో తొలి కరోనా కేసు నమోదైంది. స్థానికంగా నివసిస్తూ నరసారావు పేటలో వైద్య సేవలు అందిస్తూ వచ్చిన ఓ వైద్యురాలికి ఈ వైరస్ సోకింది. దీంతో స్థానికుల్లో ఆందోళన మొదలైంది. ముఖ్యంగా, ఆమె వైద్య చేసిన వారి గుబులు మొదలైంది. ఈ విషయం తెలిసిన వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. ఆమె వైద్యం చేసిన రోగులను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. 
 
చిలకలూరిపేటకు చెందిన ఓ మహిళ స్థానికంగా నివసిస్తూ నరసారావు పేటలో వైద్యురాలిగా పని చేస్తోంది. ఈమె గత కొన్ని రోజులుగా కరోనా లక్షణాలతో బాధపడుతూ వచ్చింది. దీంతో ఆమెకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, ఈ పరీక్షల్లో పాజిటివ్ అని తేలింది. ఇది చిలకలూరిపేటలో తొలి కరోనా కేసు నమోదైంది. 
 
స్థానికంగా నివసిస్తూ నరసరావుపేటలో పనిచేస్తున్న వైద్యురాలికి పాజిటివ్ అని తేలడంతో స్థానికుల్లో ఆందోళన మొదలైంది. అయితే, ఆమె కుటుంబ సభ్యులకు మాత్రం నెగటివ్ రిపోర్టులు రావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయినప్పటికీ వారందరినీ క్వారంటైన్‌కు తరలించారు. 
 
మరోవైపు, జిల్లాలో కరోనా కేసులకు అడ్డుకట్ట పడడం లేదు. నేడు కొత్తగా మరో 19 కేసులు నమోదయ్యాయి. వీటితో కలుపుకుని మొత్తం కేసుల సంఖ్య 177కు పెరిగినట్టు జిల్లా వైద్యాధికారులు తెలిపారు. బుధవారం గుంటూరులో 5, నరసరావుపేటలో 5, దాచేపల్లిలో 4, చిలకలూరిపేటలో ఒక కేసు నమోదైంది. తాజా కేసులతో కలుపుకుని ఒక్క గుంటూరు నగరంలోనే నమోదైన కేసుల సంఖ్య 106కు పెరిగింది.