శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 8 సెప్టెంబరు 2018 (09:46 IST)

బట్టతలపై వెంట్రుకలు మొలిపిస్తున్న ఆంధ్రా ప్రభుత్వ వైద్యులు... ఎక్కడ?

ప్రస్తుతం ప్రతి ఒక్కరినీ వేధిస్తున్న సమస్య బట్టతల. యుక్త వయసులోనే తలపై వెంట్రుకలన్నీ ఊడిపోతున్నాయి. ఫలితంగా పెళ్లికాకుండానే మైదానంలా తయారవుతోంది. ఈ తలను చూస్తూ చాలామంది డిప్రెషన్‌లోకి వెళ్లిపోతున్నారు

ప్రస్తుతం ప్రతి ఒక్కరినీ వేధిస్తున్న సమస్య బట్టతల. యుక్త వయసులోనే తలపై వెంట్రుకలన్నీ ఊడిపోతున్నాయి. ఫలితంగా పెళ్లికాకుండానే మైదానంలా తయారవుతోంది. ఈ తలను చూస్తూ చాలామంది డిప్రెషన్‌లోకి వెళ్లిపోతున్నారు. ఆత్మన్యూనతకు గురువుతున్న కొందరు తమకిక పెళ్లికాదేమోని భయపడుతున్నారు. తిరిగి జుట్టును మొలిపించుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.
 
ఇలా బట్టతల కలిగిన వారు వెంట్రుకల కోసం రకరకాల హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్లు చేయించుకుంటుంటారు. అయినా బట్టతలపై వెంట్రుకలు మొలవడం చాలా కష్టం. కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వైద్యులు మాత్రం బట్టతలపై వెంట్రుకలు మొలిపిస్తున్నారు. అదీకూడా రూపాయి ఖర్చు లేకుండానే ఈ పని చేస్తున్నారు. ఆ వైద్యులు ఎవరో కాదు వైజాగ్‌లోని కింగ్ జార్జి ఆస్పత్రిలోని చర్మ వ్యాధుల విభాగానికి చెందిన వైద్యులు. 
 
కేజీహెచ్ అందిస్తున్న ప్లేట్‌లెట్‌ రిచ్‌ ప్లాస్మా (పీఆర్పీ) చికిత్స అద్భుత ఫలితాలు అందిస్తోంది. ఈ చికిత్సతో వెంట్రుకలు రాలిన చోటే మళ్లీ మొలిపిస్తున్నారు. బయట ఈ చికిత్సకు లక్షల్లో వసూలు చేస్తుండగా, కేజీహెచ్‌లో ఇది పూర్తిగా ఉచితం. నెలకు 60 మందికి చికిత్స చేస్తున్నారు. బట్టతలతో బాధపడుతున్న వారి నుంచి రక్తాన్ని సేకరించి సెంట్రిఫ్యూజ్‌ అనే యంత్రం సాయంతో పీఆర్పీని విడదీస్తారు. 
 
దానిని జుట్టు రాలిపోయిన చోట ఇంజెక్ట్ చేస్తారు. ఫలితంగా కొన్ని వారాల తర్వాత వెంట్రుకలు నెమ్మదిగా బయటకు వస్తాయి. సమస్య తీవ్రతను బట్టి పది నుంచి 20 ఇంజెక్షన్ల వరకు చేస్తారు. దీంతోపాటు కొన్ని మందులు కూడా వాడాల్సి ఉంటుంది. అయితే, ఈ వైద్యం అందరికీ ఫలితం ఇవ్వాలనేం లేదని కేజీహెచ్ వైద్యులు చెబుతున్నారు.