1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Updated : గురువారం, 30 జులై 2015 (09:04 IST)

ప్రత్యూషకు తండ్రి జీతంలో వాటా...! సొంతింటి అద్దె కూడా.. హైకోర్టు ఆదేశం

ఆ అమ్మాయి జీవనభృతికి కొంత మొత్తాన్ని తండ్రి జీతం నుంచి ఇప్పించండి.. అలాగే ఇంటిపై వచ్చే అద్దె కూడా ఆ బాలికకే అందేలా చూడండంటూ ప్రత్యూష విషయంలో ఉమ్మడి హైకోర్టు స్పందించింది. బుధవారం ఆమెను విచారణించిన తరువాత కోర్టు తెలంగాణ ప్రభుత్వానికి సూచన చేసింది. వివరాలిలా ఉన్నాయి. 
 
తల్లిదండ్రుల చేతిలో నరకయాతన అనుభవించిన ప్రత్యూషను ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దిలీప్‌ బి.భోసలే, జస్టిస్‌ ఎస్‌.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ఛాంబర్‌లో ప్రత్యూషను రహస్యంగా విచారించింది. ఈ విచారణకు తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్‌.శరత్‌కుమార్‌, ఆంధ్రప్రదేశ్‌ అడ్వొకేట్‌ జనరల్‌ పి.వేణుగోపాల్‌లను మాత్రమే అనుమతించింది. 
 
ప్రత్యూషపై జరిగిన చిత్రహింసలను న్యాయమూర్తులు అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్తుపై దృష్టి పెట్టి బాగా చదువుకోవాలని ప్రత్యూషకు సూచించినట్లు తెలిసింది. ఆమె తండ్రి జీతం నుంచి కొంత మొత్తం, ఆమె పేరు మీద ఉన్న ఇంటిపై వచ్చే అద్దె కూడా ప్రత్యూషకే అందేలా చూడాలని ప్రభుత్వానికి సూచించింది. ప్రత్యూష పేరుతో బ్యాంకులో ఖాతా తెరచి ఆ మొత్తాలను జమ చేయాలని స్పష్టం చేసింది. 
 
ఫెర్నాండెజ్‌ ఆసుపత్రి సంరక్షణలో ఉండటానికి ప్రత్యూష అంగీకరించగా అందుకు ఆసుపత్రి సమ్మతించినట్లు తెలిసింది. తమ సంరక్షణలోనే ఇంటర్‌ పూర్తి చేయించి, తమ కళాశాలలోనే నర్సింగ్‌ చదివిస్తామని ఆసుపత్రి యాజమాన్యం హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లింది.