శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 1 ఏప్రియల్ 2024 (12:55 IST)

జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణలో ఎందుకు జాప్యం.. త్వరగా తేల్చండి : సుప్రీంకోర్టు

ys jagan
అనేక అవినీతి కేసుల్లో చిక్కుకుని గత పదేళ్లుగా బెయిల్‌పై తిరుగుతున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి త్వరలోనే గట్టి షాక్ తగిలేలా ఉంది. ఆయన బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ వైకాపా రెబెల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ ఎందుకు జాప్యం జరుగుతుందని సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది. 
 
రఘురామరాజు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ రద్దుపై సోమవారం విచారణ జరిగింది. కేసు విచారణను తెలంగాణ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూ ఆయన మరో పిటిషన్ కూడా వేశారు. ఈ రెండు పిటిషన్లను కలిపి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. 
 
ఈ విచారణ సందర్భంగా అక్రమాస్తుల కేసుల విచారణ ఎందుకు ఆలస్యమవుతోందని సీబీఐని సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది. విచారణ ఆలస్యం కావడానికి గల కారణాలను వివరిస్తూ నాలుగు రోజుల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. విచారణ వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీచేసింది. 
 
డిశ్చార్జ్ పిటిషన్ల కారణంగా విచారణ ఆలస్యం అవుతోందని సీబీఐ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు కోర్టు తెలిపారు. రాజకీయ కారణాలతో విచారణ ఆలస్యం కాకూడదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. సీఎం, రాజకీయ నేత అనే కారణాలతో విచారణలో జాప్యం జరగకూడదని జస్టిస్ సంజీవ్ ఖన్నా వ్యాఖ్యానించారు. జగన్ బెయిల్ రద్దు, కేసుల విచారణ తెలంగాణా నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయాలనే పిటిషన్లను కలిపే విచారిస్తామని ధర్మాసనం తెలిపింది. తదుపరి విచారణనను ఆగస్టు 5వ తేదీ నుంచి ప్రారంభమయ్యే వారానికి వాయిదా వేసింది.