గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 6 సెప్టెంబరు 2021 (16:03 IST)

ఏపీలో కుంభవృష్టి : విపత్తుల నిర్వహణ శాఖ కీలక ప్రకటన

ఇప్పటికే తెలంగాణా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అనేక జిల్లాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలో ఏపీలోనూ వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాలకు వంకలు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. ముంపు ప్రాంతాల్లో అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు.
 
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. వాయువ్య మరియు పశ్చిమమధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతంలో ఒడిశా - ఉత్తరాంధ్ర తీరం వెంబడి అల్పపీడనం నెలకొన్నట్లు తెలిపింది. దీని ప్రభావంతో సోమ, మంగళవారాల్లో ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు హెచ్చరించింది. 
 
అలాగే కోస్తాంధ్రలోని మిగిలిన చోట్ల మోస్తారు నుంచి తేలికపాటి జల్లులు కురిసే అవకాశమున్నట్లు తెలిపింది. రాయలసీమలో అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురిసే అవకాశమున్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ ఆ ప్రకటనలో తెలిపింది. అల్పపడీన ప్రభావంతో ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 50-60 కీ.మీ వెగంతో గాలులు వీచే అవకాశముందని అందువల్ల జాలర్లు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.