గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 4 మే 2023 (22:13 IST)

ఉమ్మడి ఆస్తుల విభజన... తెలంగాణాకు షాకిచ్చిన కేంద్రం

ap bhavan
రెండు తెలుగు రాష్ట్రాలకు ఢిల్లీలో ఉమ్మడి ఆస్తులు ఉన్నాయి. ఈ ఆస్తుల విభజనకు సంబంధించి కేంద్రం గురువారం కీలక ప్రతిపాదనలు చేసింది. ముఖ్యంగా తెలంగాణ సర్కారు విజ్ఞప్తికి విరుద్ధంగా ఈ ప్రతిపాదనలు చేసింది. దీంతో తెలంగాణ అధికారులు ఏం చేయాలో తెలియక అయోమయంలో పడిపోయారు. 
 
దేశ రాజధాని ఢిల్లీలో ఏపీ భవన్‌ను తమకు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. ఏపీ భవన్‌‍తో తమ భావోద్వేగాలు ముడిపడివున్నాయని తెలంగాణ వాదిస్తుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ఏపీ భవన్‌పై కేంద్రం కీలక ప్రతిపాదనలు చేసింది. 
 
7.64 ఎకరాల పటౌడీ హౌస్‌ను తెలంగాణ తీసుకోవాలని, మిగిలిన 12.09 ఎకరాల ఖాళీ భూమిని ఏపీ తీసుకోవాలని పేర్కొంది. అలాలగే, గోదావరి, శబరి బ్లాకులు, నర్సింగ్ హాస్టల్‌ను కూడా ఏపీనే తీసుకోవాలని సూచన చేసింది. ఒకవేళ ఏపీకి అదనపు భూమి దక్కితే, ఆ మేరకు తెలంగాణాకు ఏపీ భర్తీ చేయాలని తెలిపింది. 
 
ఢిల్లీలోని ఉమ్మడి ఆస్తుల విభజనపై గత నెల 26వ తేదీన ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు కీలక భేటీ నిర్వహించారు. ఇందులో తెలంగాణ ప్రభుత్వం తమకు కావాల్సిన ఆస్తుల జాబితాను ఏపీ అధికారులకు సమర్పించింది. ఈ పరిస్థితుల్లో ఈ భేటీ వివరాలను కేంద్ర హోం శాఖ రెండు రాష్ట్రాల అధికారులకు పంపించింది. భూములు, భవనాల విభజనపై ఏపీ గతంలో మూడు ప్రతిపాదనలు చేసింది. 
 
ఈ నేపథ్యంలో ఆస్తుల పంపకంపై తెలంగాణ నుంచి ఓ కొత్త ప్రతిపాదన వచ్చింది. గోదావరి, శబరి బ్లాకులు కూడా తమకు ఇవ్వాలని తెలంగాణ కోరింది. నర్సింగ్ హాస్టల్‌ పక్కనే ఉన్న ఖాలీ స్థలం కూడా తమకు ఇవ్వాలని ప్రతిపాదించింది.
 
అయితే, తాజాగా కేంద్రం చేసిన ప్రతిపాదన తెలంగాణ ప్రభుత్వ అధికారులు చేసిన ప్రతిపాదనలకు పూర్తి విరుద్ధంగా ఉండటం గమనార్హం. విభజన నేపథ్యంలో ఉమ్మడి ఆస్తులను 58:42 నిష్పత్తిలో ఏపీ, తెలంగాణ పంచుకోవాలని కేంద్రం చెబుతోంది.