శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శనివారం, 9 అక్టోబరు 2021 (10:21 IST)

మహిళలకే కాదు పురుషులు, ట్రాన్స్‌జెండర్లకూ ఇళ్ళ‌ స్థలాలివ్వాలి

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ‘నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు’ పథకంలో పలు లోపాలను హైకోర్టు ఎత్తిచూపింది. పట్టణాల్లో సెంటు, గ్రామాల్లో సెంటున్నర స్థలాలు సరిపోవని, ఈ విషయంలో ప్రత్యేక కమిటీతో అధ్యయనం చేయించాలని సూచించింది. ఆ ప్రక్రియ ముగిసే వరకు ఆ స్థలాల్లో నిర్మాణాలు చేపట్టవద్దని తీర్పు చెప్పింది. మహిళల పేరుతోనే పట్టాలివ్వడం సరికాదని, అర్హులైన పురుషులు, ట్రాన్స్‌జెండర్లకూ ఇవ్వాలని చెప్పింది.
 
ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్‌ కన్వేయన్స్‌ డీడ్‌లను రద్దు చేసి, అర్హులకు డీ-ఫాం పట్టాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తెనాలికి చెందిన పొదిలి శివమురళి, మరో 128 మంది గతేడాది డిసెంబరులో హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తి ఈ   సంచలన తీర్పు ఇచ్చారు. ఇళ్ల స్థలాల విస్తీర్ణంపై కోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. ఇళ్ల నిర్మాణంలో పర్యావరణ ప్రభావం, ఆరోగ్య సమస్యలు, ఇతర అంశాలపై అధ్యయనానికి కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, కేంద్ర గృహ, పట్టణాభివృద్ధి, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలకు చెందిన ముగ్గురు నిపుణులతో నెల రోజుల్లో కమిటీ వేయాలని ఆదేశించింది. మరో నెలలో ఆ కమిటీ నివేదిక ఇవ్వాలని నిర్దేశించింది. నివేదికను రెండు స్థానిక పత్రికల్లో ప్రచురించి.. ప్రజల అభ్యంతరాలు స్వీకరించాలని సూచించింది.
 
ఆ తర్వాతే ఈ పథకాన్ని ఖరారు చేయాలని స్పష్టంచేసింది. కమిటీ నివేదిక ఆధారంగా అదనపు భూమి కొని, స్థలం విస్తీర్ణం పెంచి, లబ్ధిదారులకు కేటాయించిన లేఅవుట్లను సవరించాలని స్పష్టం చేసింది. ఈ ప్రక్రియ ముగిసేవరకూ ఈ పథకం కింద కేటాయించిన భూముల్లో నిర్మాణాలు చేపట్టవద్దని తేల్చిచెప్పింది. ఇళ్ల స్థలాల కేటాయింపునకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవో 367లోని మార్గదర్శకాలు-2,3, జీవో 488లోని క్లాజ్‌ 10,11,12, జీవో 99లోని క్లాజ్‌ బీ,డీలను చట్టవిరుద్ధమైనవంటూ, వాటిని రద్దు చేసింది.
 
ఆ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్‌ కన్వేయన్స్‌ డీడ్‌లను రద్దు చేయాలని కోర్టు తన తీర్పులో పేర్కొంది. వాటి స్థానంలో నిపుణుల కమిటీ సిఫారసుల మేరకు బీఎస్‌వో 21, ఏపీ అసైన్డ్‌ భూముల చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా అర్హులకు డీ-ఫాం పట్టాలు ఇవ్వాలని ఆదేశించింది. ఇళ్ల పట్టాలను మహిళా లబ్ధిదారులకే ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టింది. మహిళలతో పాటు అర్హులైన పురుషులు, ట్రాన్స్‌జెండర్లకూ పట్టాలు ఇవ్వాలంది. మహిళల పేరుతోనే ఇళ్ల పట్టాలు ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయం.. అధికరణ 14, 15(1), 39కి విరుద్ధమని తేల్చిచెప్పింది. ఆ నిర్ణయం మానవ హక్కుల యూనివర్సల్‌ డిక్లరేషన్‌కు వ్యతిరేకమంది.