బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 22 ఆగస్టు 2019 (15:31 IST)

ఈ-కేవైసీతో తప్పని తిప్పలు .. రేయింబవుళ్లు పడిగాపులు

ఈ-కేవైసీ విధానంతో ప్రజలకు పాట్లు తప్పడం లేదు. నకిలీ రేషన్‌ కార్డులను ఏరివేసి.. అర్హత కలిగిన వారికే అత్యవసర సరకులు ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయం బాగానే ఉన్నా.. కావాల్సినన్ని కేంద్రాలు లేకపోవడంతో ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. ప్రధానంగా మహిళలు, వృద్దులు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 
 
అసలు పిల్లలకు ఆధార్ లింక్ ఎందుకు అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరిస్థితులు కొనసాగుతున్నా.. యంత్రాంగం సరైన సదుపాయాలు కల్పించడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో ఆధార్‌ కేంద్రాల వద్ద ప్రజలు నానా పాట్లు పడుతున్నారు. జిల్లాలోని మీసేవా కేంద్రాల్లో ఈ తరహా సేవలు నిలిపివేశారు. కొన్ని బ్యాంకులతో పాటు, తపాలాకార్యాలయాల్లో అవకాశం కల్పించారు. 
 
అయితే, కావాల్సినన్ని కేంద్రాలు లేకపోవడంతో ఆధార్‌ నమోదుతో పాటు నవీకరణ కోసం ప్రజలు పడరానిపాట్లు పడుతున్నారు. అర్థరాత్రి నుంచే ఈ ప్రక్రియ కోసం జనాలు బారులు తీరుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ పథకాలతోపాటు రేషన్‌ సరకులకు ఈ కేవైసీ తప్పని సరికావడంతో జనాలు నమోదు కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు.