సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 22 అక్టోబరు 2024 (09:58 IST)

అమరావతి నిర్మాణానికి హడ్కో రూ.11 వేల కోట్లు - డిసెంబరు నుంచి నిర్మాణ పనులు..

amaravati capital
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణ పనులు ఇకపై జెట్ స్పీడ్ వేగంతో సాగనున్నాయి. రాజధాని నిర్మాణానికి అనేక సంస్థలు రుణాలు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నాయి. ఇందులోభాగంగా, హౌసింగ్, అర్బన్ డెవలెప్‌మెంట్ కార్పొరేషన్ - హడ్కో రూ.11 వేల కోట్ల రుణం ఇచ్చేందుకు అంగీకారం తెలిపింది. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ రాష్ట్ర పురపాలక శాఖామంత్రి పి.నారాయణ హడ్కో సీఎండీతో నిర్వహించిన భేటీలో హడ్కో తన సమ్మతాన్ని తెలియజేసింది. 
 
ఇప్పటికే అమరావతి నిర్మాణానికి రూ.15 వేల కోట్ల రుణం ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంకు కూడా అంగీకారాన్ని తెలియజేసింది. త్వరలోనే దీనికి సంబంధించిన ఒప్పందాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, సీఆర్డీయేతో ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నారు. ప్రస్తుతం రాజధాని నిర్మాణంలో భాగంగా అమరావతిలో ప్రభుత్వ భవన సముదాయాలు, అసెంబ్లీ, సచివాలయ టవర్లు, రాజ్‌భవన్, హైకోర్టు తదితర ప్రాజెక్టులను నిర్మించాల్సివుంది. 
 
కేంద్ర ప్రభుత్వం హామీదారుగా ప్రపంచ బ్యాంకు, ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంకుల ద్వారా రూ.15 వేల కోట్ల రుణాన్ని సేకరించి రాజధానిలో మౌలిక సదుపాయాల కల్పన, ట్రంక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణం కోసం వినియోగించనున్నారు. ఇక మిగిలిన రూ.11 వేల కోట్ల నిధుల మంజూరుకు హడ్కో అంగీకారాన్ని తెలియజేసింది. రుణ మంజూరుకు ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనకు సంతృప్తి చెందిన హడ్కో రూ.11 వేల కోట్లరుణం మంజూరుకు ఆమోదాన్ని తెలియజేసింది. ఈ నిధులు విడుదల కాగానే డిసెంబరు నుంచి అమరావతి రాజధాని పరిధిలో పనులు వేగం పుంజుకోనున్నాయి.