నేను తెలుగుదేశంలో చేరుతున్నా... ఏపీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణికి ఆడపడుచు షాక్
ఎన్నికలకు మరో రెండున్నరేళ్లు సమయం వుంది కానీ ఇప్పుడే హీట్ మొదలైనట్లుంది. జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. తెదేపాతో స్నేహం వుంటుందన్నది పరోక్షంగా ఆయన చెప్పకనే చెప్పారు. దీనితో ఇప్పుడు తెలుగుదేశం శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనబడుతోంది. రానున్న ఎన్నికల్లో పవర్ స్టార్ వెన్నుదన్నుగా వుంటారన్న ఆశతో అప్పుడే ఆశావహులు తెదేపా తీర్థం పుచ్చుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
ఇక అసలు విషయానికి వస్తే... ఏపీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ఆడపడుచు పల్లవిరాజు ఆమెకి షాకిచ్చే నిర్ణయం వెల్లడించారు. త్వరలో తను తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. పార్వతీపురంలో తన అనుచరులతో సమావేశమయ్యాక ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
గిరిజనుల సమస్యలను పరిష్కరించడంలో వైకపా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనీ, అందుకే వారి సమస్యల పరిష్కారం కోసం తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. కాగా గత ఎన్నికల్లో పల్లవి రాజు తెలుగుదేశం పార్టీ టిక్కెట్ ఆశించి పొందలేకపోయారు.