శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 21 అక్టోబరు 2021 (11:43 IST)

మీ వీపులు విమానం మోత మోగిస్తాం : వైకాపా నేతలకు నారా లోకేశ్ వార్నింగ్

వైకాపా నేతలకు టీడీపీ నేత నారా లోకేశ్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. వైకాపా నేతలు చేస్తున్న దాడులు, అరాచకాలకు వడ్డీతో సహా చెల్లిస్తామంటూ హెచ్చరించారు. ముఖ్యంగా, ఎక్కడ దాక్కొన్నప్పటికీ బయటకు లాక్కొచ్చి వీపులు పగలగొడతాం అంటూ హెచ్చరించారు. ముఖ్యంగా, తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఉన్నంత సహనం, ఓర్పు తనకు లేదని, అందువల్ల రెండున్నరేళ్ల తర్వాత వీపులు విమానం మోత మోగడం ఖాయమని హెచ్చరించారు. 
 
ఆయన తాజాగా మాట్లాడుతూ, రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి మాఫియా పెరిగిందన్నారు. దేశంలో ఎక్కడ డ్రగ్స్, గంజాయి పట్టుబడినా... దాని మూలాలు ఏపీలో ఉంటున్నాయన్నారు. ఏపీ నుంచే గంజాయి ఎక్కువగా వస్తోందని సాక్షాత్తు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ చెప్పారని అన్నారు.
 
డ్రగ్స్‌పై పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారని... ఏపీ సీఎం జగన్ మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదని విమర్శించారు. గంజాయిని నివారించాలనే ఆలోచన పోలీసులకు లేదన్నారు. టీడీపీ కార్యాలయంలో నాలుగు అద్దాలు పగిలినంత మాత్రాన తాము భయపడబోమని నారా లోకేశ్ అన్నారు. రాబోయే రోజుల్లో మీ వీపులు పగులుతాయని హెచ్చరించారు.
 
తమ అధినేత చంద్రబాబుకు ఉన్నంత సహనం తనకు లేదన్నారు. దేవాలయం వంటి తమ పార్టీ కార్యాలయంపై దాడి చేశారని... వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు. టీడీపీ ఆఫీస్‌పై దాడి చేసిన వారి కార్లు డీజీపీ కార్యాలయం ముందు నుంచే వచ్చాయని... దాడి తర్వాత కూడా మళ్లీ అటువైపే వెళ్లాయని చెప్పారు.
 
పోలీసులను మఫ్టీలో పంపించి దాడులు చేయించారని ఆరోపించారు. జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చంద్రబాబుపై అనేక వ్యాఖ్యలు చేశారని... చంద్రబాబును కాల్చాలని ఆయన అన్నారా? లేదా? అని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏపీ పోలీసులను వైసీపీ నేతలు ఎన్నో తిట్లు తిట్టారని... అయినా వారిపై చర్యలు తీసుకోలేదని నారా లోకేశ్ గుర్తుచేశారు.