గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , సోమవారం, 11 అక్టోబరు 2021 (12:37 IST)

జర్నలిస్టుల సమస్యలపై నిర్లక్ష్యం తగదు

జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ నిర్లక్ష్యం తగదని, వివిధ వర్గాల సంక్షేమం కోసం పాటుపడుతున్నట్లు గొప్పలు చెప్పుకుంటున్న పాలకులు జర్నలిస్టుల సంక్షేమాన్ని ఎందుకు విస్మరిస్తున్నారని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజేయూ), తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయుడబ్ల్యుజె) నాయకత్వం ప్రశ్నించింది.
 
హైదర్ గుడ లోని సెంటర్ పార్క్ హోటల్ కాన్ఫరెన్స్ హాలులో టీయుడబ్ల్యుజె రాష్ట్ర అధ్యక్షులు నగునూరి శేఖర్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై దాదాపు 6 గంటల పాటు సమావేశం చర్చించింది. ముఖ్యంగా కోవిడ్ తో పాటు వివిధ సంఘటనల్లో అకాల మరణం చెందిన జర్నలిస్టుల కుటుంబాలు దీనస్థితిలో జీవితాలు గడుపుతున్నా బాధితులను ప్రభుత్వం పట్టించుకోక పోవడం విచారకరమని ఐజేయూ జాతీయ అధ్యక్షులు కె.శ్రీనివాస్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పట్ల విశ్వాసం లేనందున తమ యూనియన్ నుండి గ్రూప్ ఇన్సూరెన్స్ చేయించడంతో పాటు, సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి ఆపదలో ఉన్న జర్నలిస్టుల కుటుంబాలను ఆదుకునే దిశలో కార్యాచరణ రూపొందిస్తామన్నారు.
 
ఐజేయూ సీనియర్ నాయకులు దేవులపల్లి అమర్ మాట్లాడుతూ మీడియా సంస్థల యాజమాన్యాల యాడ్స్ టార్గెట్లను భరించలేక గ్రామీణ ప్రాంతాల్లో విలేఖరులు ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితి నెలకొనడం సహించరానిదన్నారు. యాజమాన్యాల వైఖరి మూలంగా మెదక్ జిల్లా నర్సాపూర్ లో వార్త విలేఖరి ప్రవీణ్ గౌడ్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన, మరికొన్ని చోట్ల ఆత్మహత్యలకు విలేఖరులు ప్రయత్నించిన సంఘటనలను సీరియస్ గా తీసుకొని రాష్ట్ర,జాతీయ స్థాయిలో చర్చ జరిగే విధంగా తగు కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. 
 
టీయుడబ్ల్యుజె రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శేఖర్, విరాహత్ అలీలు మాట్లాడుతూ ఆర్థిక సహకారం కోసం మీడియా అకాడమీకి కోవిడ్ బాధిత జర్నలిస్టులు దరఖాస్తులు సమర్పించి నెలలు గడుస్తున్నా వారికి సహకారం అందడం లేదని, వెంటనే అకాడమీ స్పందించకుంటే బాధితులతో ఆందోళన కార్యక్రమం చేపట్టక తప్పదని వారు హెచ్చరించారు. అక్టోబర్ మాసాంతరం వరకు 33 జిల్లాల్లో సభ్యత్వాల నమోదు ప్రక్రియను పూర్తిచేసి, నవంబర్ మాసాంతరం వరకు సర్వసభ్య సమావేశాలను పూర్తి చేయాల్సిన బాధ్యతా జిల్లా శాఖలపై ఉంటుందని వారు సూచించారు. సమావేశానికి ముందు ఇటీవలీ కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా మృతి చెందిన జర్నలిస్టులకు నివాళి అర్పించి సంతాపం వ్యక్తం చేశారు. అనంతరం పలు తీర్మానాలను కార్యవర్గ సమావేశం ఆమోదించింది.
 
ఈ సమావేశంలో ఐజేయూ కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి, ఐజేయూ జాతీయ కార్యవర్గ సభ్యులు దాసరి కృష్ణారెడ్డి, కల్లూరి సత్యనారాయణ, పిసిఐ సభ్యులు ఎం.ఏ.మాజిద్, టీయుడబ్ల్యుజె ఉప ప్రధాన కార్యదర్శి విష్ణుదాస్ శ్రీకాంత్, రాష్ట్ర ఉపాధ్యక్షులు రాంనారాయణ, కరుణాకర్, కోశాధికారి మహిపాల్, రాష్ట్ర కార్యదర్శి గుడిపల్లి శ్రీనివాస్ లతో రాష్ట్ర కార్యవర్గం, 26 జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.