శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By CVR
Last Updated : శుక్రవారం, 31 జులై 2015 (13:34 IST)

నెల్లూరు కళాశాలలో ర్యాగింగ్ భూతం.. అనంత విద్యార్థి ఆత్మహత్య...

కళాశాలల్లో సీనియర్ విద్యార్థుల ఆగడాలు ఆగడం లేదు. ర్యాగింగ్‌‌పై ఎన్ని చట్టాలు చేసిన ప్రయోజనం లేకుండా పోతుంది. ర్యాగింగ్ పేరుతో సీనియర్ విద్యార్థులు జరిపే వేధింపులను భరించలేక ప్రాణాలు తీసుకునే వారి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. తాజాగా నెల్లూరు జిల్లాలోని ఒక కళాశాలలో విద్యార్థుల ర్యాగింగ్‌ తట్టుకోలేక అనంతపురం జిల్లాకు చెందిన విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. 
 
వివరాల్లోకి వెళితే.. అనంతపురం జిల్లా ఓడీసీ మండలం దొమ్మితోటవారిపల్లెకు చెందిన మధువర్థన్ రెడ్డి.. నెల్లూరు జిల్లాలో ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ చదువుతున్నాడు. సీనియర్లు ర్యాగింగ్ వేధింపులు భరించలేక మధువర్ధన్ రెడ్డి సొంతూరుకు చేరాడు. కాలేజీలో విద్యార్థులు ర్యాగింగ్ చేస్తున్నారని.. వేధింపులు తట్టుకోలేక ఇంటికొచ్చానని తల్లిదండ్రులకు తెలిపాడు. 
 
ఈ క్రమంలో భవిష్యత్‌పై తీవ్ర మనో వేదనకు గురైన మధువర్ధన్ రెడ్డి గురువారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ చేస్తున్నట్లు కాలేజీ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మృతుడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.