యలమంచిలి రవికి అవకాశం దక్కేనా !?
శాసన మండలి (ఎంఎల్సీ) ఎన్నికల నగారా మోగింది. శాసన సభ్యుల కోటాలో ఆరుగురికి కొత్తగా శాసన మండలిలో స్థానం దక్కనుంది. శాసన సభలో బలాబలాలను అనుసరించి మొత్తం ఆరు స్థానాలు వైసిపికే దక్కనున్నాయి. పలువురు ఈ స్థానాల కోసం పోటీ పడుతుండగా విజయవాడ తూర్పు మాజీ శాసన సభ్యుడు యలమంచిలి రవికి అవకాశం లభిస్తుందా లేదా అన్నది ఆసక్తిదాయకంగా మారింది.
విజయవాడ నగర రాజకీయాలలో యలమంచిలి కుటుంబానికి ఉన్న క్లీన్ ఇమేజ్ మరే నాయకుడికి లేదంటే అతిశయోక్తి కాదు. యలమంచిలి నాగేశ్వరరావు శాసన సభ్యునిగా పనిచేసినా, తర్వాత రవి శాసనసభ్యునిగా సేవలు అందించినా మచ్చలేని మనుషులుగానే పేరు గడించారు.
గత శాసన సభ ఎన్నికలకు ముందు వైసిపి తీర్థం పుచ్చుకున్న యలమంచిలి రవి విజయవాడ తూర్పు నుంచి అభ్యర్థిగా ఖరారు అయ్యారు. చివరి నిమిషంలో సీటు విషయంలో మార్పు జరిగినా పార్టీ అధినేత అదేశాలకు తలొగ్గి నాటి నుండి నేటి వరకు పార్టీ కోసమే పనిచేస్తూ వచ్చారు.
గుడివాడలో తెలుగుదేశం అభ్యర్థిగా పరాజయం పాలైన దేవినేని అవినాష్ వైసిపిలో ప్రవేశించిన తరువాత, అప్పటి వరకు ఉన్న నియోజక వర్గ ఇన్‌చార్జిగా ఉన్న రవిని అధినాయకత్వం మార్చింది. అసెంబ్లీ సీటు ఇవ్వలేక పోయిన పరిస్థితులలో రవి సేవలను తగిన విధంగా సద్వినియోగం చేసుకుంటామని గతంలోనే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి స్పష్టమైన హామీ ఇచ్చారు.
యలమంచిలి రవి పట్ల ఉన్న ప్రత్యేక అపేక్షతో ఆయన కుమారుడు రాజీవ్ వివాహ వేడుకకు కూడా ముఖ్యమంత్రి హోదాలో వైఎస్.జగన్ మోహన్ రెడ్డి హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి యలమంచిలికి అవకాశం కల్పిస్తారా లేదా అన్నది విజయవాడలో చర్చనీయాంశమైంది. నిజానికి గత ఎన్నికలలో వియవాడ తూర్పు సీటును రవికి ఇచ్చిఉంటే తప్పనిసరిగా విజయం సాధించే వారిమన్న దిశగా పార్టీ అంతర్గత సమావేశాలలో చర్చ కూడా జరిగింది.