శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 5 ఆగస్టు 2020 (19:25 IST)

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఐఎస్ బీ ఒప్పందం: మంత్రి మేకపాటి

ప్రజారంజక పరిపాలనలో కొత్త ఒరవడికి 'ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఐఎస్ బీ ఒప్పందం' మరో ఆరంభమవుతుందని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం సమగ్రాభివృద్ధి సాధించే దిశగా అడుగులు వేస్తోందని మంత్రి మేకపాటి స్పష్టం చేశారు.

బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సమక్షంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం-ఐఎస్ బీతో అవగాహన ఒప్పందం(ఎంవోయూ) కుదుర్చుకుంది. ఏపీ ఈడీబీ, సీఈవో సుబ్రమణ్యం జవ్వాది, ఐఎస్ బీ డీన్ ప్రొఫెసర్ రాజేంద్ర శ్రీవాత్సవ సంతకాలతో  ఒప్పందం జరిగింది. ప్రజలు మెచ్చే పారదర్శక పాలను అందించడంలో సీఎం జగన్ రాజీపడరని మంత్రి తెలిపారు.

అందులో భాగంగానే విజ్ఞానం, అధ్యయనం, విశ్లేషణ, పరిశోధన, ప్రణాళికతో కూడిన వ్యూహాత్మక అభివృద్ధికోసమే ఎంవోయూ కుదుర్చుకున్నామని  మంత్రి మేకపాటి వ్యాఖ్యానించారు.

తాజా ఒప్పందంతో కోవిడ్-19  అనంతర పారిశ్రామిక, నైపుణ్య, పెట్టుబడి రంగాలలో సంస్కరణల ద్వారా ఉపాధి అవకాశాలు, ఆర్థిక ప్రగతిపై ప్రత్యేకంగా దృష్టిసారించనున్నట్లు పరిశ్రమలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్. కరికాల వలవన్  పేర్కొన్నారు.  దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఐఎస్ బీ ఎంవోయూ కుదుర్చుకోవడం కొత్త ఉత్సాహాన్ని, మరింత బాధ్యతను పెంచిందని ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అశ్విని ఛాట్రే వెల్లడించారు. 
 
'యూకే తరహాలో 'పబ్లిక్ పాలసీ ల్యాబ్' ఏర్పాటుకు శ్రీకారం'
కచ్చితమైన ఆధారాలతో కూడిన ఆలోచనలను ఆచరణలో పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధివైపు నడిపించేందుకు "ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం- ఐఎస్ బీ పబ్లిక్ పాలసీ ల్యాబ్" ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి మేకపాటి వెల్లడించారు.

ఈ ల్యాబ్ ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వప్నించే ప్రజా పరిపాలన, పారదర్శకత, జవాబుదారీతనం, త్వరితగతిన కచ్చితమైన నిర్ణయాలు, ఖర్చులనుతగ్గించడం వంటి లక్ష్యాలను దశలవారీగా చేరుతామని మంత్రి ఆకాంక్షించారు. తద్వారా పరిపాలనను ప్రజల ముంగిటకు తీసుకువస్తామని మంత్రి పేర్కొన్నారు.
 
మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి శైలిని మెచ్చుకున్న ఐఎస్ బీ ప్రతినిధులు కరోనా నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో ఆర్థిక పునరుద్ధరణలో విశాఖ పట్టణాన్ని కీలకంగా మార్చడం, రాయలసీమలో ఆహార శుద్ధి పరిశ్రమలకు ప్రాధాన్యత, ఈ-గవర్నెన్స్ కు పెద్దపీట, నైపుణ్య, శిక్షణలో సరికొత్త విధానాలను తీసుకువస్తామన్నారు మంత్రి మేకపాటి.

రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలకు వెంటనే పరిష్కారం చేయడంలో శాశ్వత మార్గాలను నిర్మిస్తామని తద్వారా నిర్దేశిత అంచనాలను అందుకుంటూ కచ్చితమైన సమగ్రవృద్ధి సాధిస్తామని మంత్రి మేకపాటి పేర్కొన్నారు. జూన్ 24న మొదటి సారి సమావేశమై..ఆగస్ట్ 5వ తేదీలోగా అవగాహన ఒప్పందం కుదరడం..అంకితభావం, తపనకు నిదర్శనమని..అందుకు ముఖ్యమంత్రి స్ఫూర్తి అని మంత్రి అన్నారు.

ఒప్పందం కార్యక్రమం విజయవంతం చేసిన మంత్రిమేకపాటి గౌతమ్ రెడ్డి ఓఎస్డీ టి.అనిల్, ఐఎస్ బీ కి చెందిన శ్రీధర్ భాగవతుల ద్వయాన్ని మంత్రి సహా ఐఎస్ బీ బృందం ప్రశంసించింది. రాష్ట్ర ప్రజలకు భరోసాతో కూడిన భవిష్యత్ అందించే దిశగా ప్రభుత్వం దార్శనిక ఆలోచనలతో ముందుకు వెళుతుండడాన్ని ఐఎస్ బీ సంస్థ డీన్ రాజేంద్ర శ్రీవాత్సవ అభినందించారు.

సరికొత్త మార్పును తీసుకురావడానికి  వేగంగా, అవగాహనతో కూడిన నిర్ణయాలు తీసుకునే మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి శైలిని మెచ్చుకున్నారు. సమాజ అభివృద్ధిలో రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలను చేరడంలో సలహాలను తీసుకుని వాటిని నిర్దేశించుకున్న సమయానికే చేరుకోవడంలో చిత్తశుద్ధిగా భాగస్వామ్యమందిస్తామని డీన్ రాజేంద్ర పేర్కొన్నారు.
 
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన 'ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం- ఐఎస్ బీ పబ్లిక్ పాలసీ' అవగాహన ఒప్పంద కార్యక్రమంలో  పరిశ్రమలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్. కరికాల వలవన్, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. అనంతరాము, పరిశ్రమల శాఖ కమిషనర్, సుబ్రహ్మణ్యం జవ్వాది, నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీ, సీఈవో అర్జా శ్రీకాంత్, పరిశ్రమల శాఖ సలహాదారు లంకా శ్రీధర్,

ఐ.టీ శాఖ సలహాదారులు లోకేశ్వర్ రెడ్డి,  విద్యాసాగర్ రెడ్డి, ఐఎస్ బీ ప్రతినిధులు:  ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అశ్విని ఛాట్రే, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ భగవాన్ చౌదరి, భర్టీ ఇన్ స్టిట్యూట్ ఫర్ పబ్లిక్ పాలసీ  డిజిటల్ ఐడెంటిటి రీసెర్చ్ ఇన్షియేటివ్ విభాగం, ఆచార్య చంద్రశేఖర్ శ్రీపాద, క్లినికల్ ప్రొఫెసర్ ఆర్గనైజేషనల్ బిహేవియర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ , ప్రొఫెసర్ దీప మణి, శ్రీని రాజు సెంటర్ ఫర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, నెట్ వర్క్డ్ ఎకానమీ, ఎక్స్ టర్నల్ రిలేషన్స్ డైరెక్టర్ డీఎన్ వీ కుమార గురు, తదితరులు  పాల్గొన్నారు.