30న పీఎస్ఎల్వీ సీ-56 ప్రయోగం : సిద్ధమైన ఇస్రో
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమవుతుంది. ఈ నెల 30వ తేదీన పీఎస్ఎల్వీ సీ-56 రాకెట్ ప్రయోగం చేపట్టనుంది. ఇది ఒక వాణిజ్యపరమైన ప్రయోగం. సింగపూర్‌కు చెందిన పలు ఉపగ్రహాలను నింగిలోకి ప్రయోగించనున్నారు. ఇందుకోసం పీఎస్ఎల్వీ సీ56 రాకెట్‌ను సర్వసన్నద్ధం చేశారు. ఈ ప్రయోగాన్ని ప్రయోగానికి శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటరులో సన్నాహాలు జరుగుతున్నాయి. జులై 30న ఉదయం 6.30 గంటలకు ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లేలా షెడ్యూల్ రూపొందించారు.
శ్రీహరికోటలోని మొదటి లాంచ్ పాడ్ ఈ రాకెట్ ప్రయోగానికి వేదికగా నిలవనుంది. పీఎస్ఎల్వీ సి-56 రాకెట్ ద్వారా ప్రధానంగా సింగపూర్ డీఎస్ టీఏ-ఎస్టీ ఇంజినీరింగ్ సంస్థకు చెందిన డీఎస్-ఎస్ఏఆర్ ఉపగ్రహాన్ని రోదసిలోకి మోసుకెళ్లనుంది. దాంతోపాటే సింగపూర్ నాన్యాంగ్ టెక్నాలాజికల్ యూనివర్సిటీకి చెందిన వెలాక్స్-ఏఎం, ఆర్కేడ్, స్కూబ్-2 ఉపగ్రహాలను... సింగపూర్ న్యూస్ స్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన న్యూలియాన్, సింగపూర్ నేషనల్ యూనివర్సిటీకి చెందిన గెలాసియా-2, ఏలియనా ప్రైవేట్ లిమిటెడ్ సింగపూర్ కు చెందిన ఓఆర్ బి-12 ఉపగ్రహాలను కూడా పీఎస్ఎల్వీ సి-56 రాకెట్ నిర్దేశిత కక్ష్యల్లో ప్రవేశపెట్టనుంది.
కాగా, ఈ రాకెట్ ప్రయోగాన్ని ప్రజలు వీక్షించవచ్చని, ఆసక్తి గలవారు తమ వివరాలను నమోదు చేసుకోవాలని ఇస్రో సూచించింది. సోమవారం సాయంత్రం 6 గంటలకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైందని షార్ సెంటర్ అధికారులు తెలిపారు. కాగా, ఇటీవలే ఈ కేంద్రం నుంచి చంద్రయాన్-3 ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టిన విషయం తెల్సిందే.