శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Updated : శనివారం, 6 అక్టోబరు 2018 (21:04 IST)

శ్రీవారి ఆలయంలో వెయ్యేళ్ళ కిందట జరిగిన మోసం.. తెలిస్తే షాకే..?

దేవుడన్న భయం కూడా లేకుండా స్వామివారి సందపను మింగేసే ఘనులు ఈనాడే కాదు… ఆనాడూ ఉన్నారు. శ్రీవారి ఆలయంలో దీపారాధన కోసం ఇచ్చిన బంగారాన్ని స్వాహా చేసిన వారి నుంచి ఉదంతం రాజుల కాలంలోనే జరిగింది. ఆ స్వాహారాయుళ్లపై విచారణ జరిపించి… ఆ బంగారాన్ని స్వామి ఖజానాకు జమ చేశారు. ఇలాంటివి ఒకటి రెండు ఉదంతాలు శాసనాల్లో కనిపించాయి. 
 
ఇది చోళ రాజుల కాలం నాటి ఉదంతం. అంటే…. సుమారు 1000 సంవత్సరాల ముందు నాటి ఘటన. అప్పుడు తిరుపతి నగరం ఇంకా ఏర్పడలేదు. తిరుచానూరు, తిరుమండ్యం గ్రామాలు బాగా ప్రాచుర్యంలో ఉన్నాయి. అలాంటి తిరుమండ్యం పాలనాధికారికి దాతల నుంచి 23 పాన్‌ బంగారు నాణేలు విరాళంగా అందాయి. శ్రీవారి ఆలయంలో రోజూ 24 నెయ్యి దీపాలు వెలిగించే ఒప్పందంతో ఈ బంగారు నాణేలు అందజేశారు దాతలు. అయితే… తిరుమండ్యం గ్రామాధికారి శ్రీవారి ఆలయంలో 24 దీపాలకు బదులు 2 దీపాలు మాత్రమే వెలిగిస్తూ వచ్చారట.
 
ఆ రోజుల్లో ఆలయాలను పర్యవేక్షించడానికి ‘అరుళక్కిం’ అనే పదవి ఉండేది. ఆయన ఆలయాల్లో పూజలు, నైవేద్యాలు సక్రమంగా జరుగుతున్నదీ లేనిదీ తనిఖీ చేసేవారు. మొదటి రాజేంద్ర చోళ దేవుడు పాలనలో ఉండగా…. అరుళక్కిం అధికారి ఒకరు తిరుచానూరుకు వచ్చారు. అక్కడే విడిది చేశారు. అప్పుడు తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగే దీపారాధన గురించి చర్చిస్తుండగా… అర్చకులు ఓ ఫిర్యాదు చేశారు. తిరుమండ్యం పాలనాధికారి మోసాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అంతే…. తిరుమండ్యం గ్రామాధిపతిని పిలిచి విచారించారు. ఆయన చేసిన తప్పునకు మందలించారు. అంతేగాక అతని నుండి 23 పాన్‌ బంగారాన్ని వసూలు చేసి శ్రీవారి ఖజానాకు జమ చేయించారట. 
 
అప్పటి నుంచి ఆలయంలో 24 దీపాలు వెలిగించే బాధ్యతను ఆలయ అధికారులకు అప్పజెప్పారట. ఇది క్రీ.శ.1235 నాటి ఉదంతం. మూడో రాజరాజ చోళుని పరిపాలనా కాలంలో జరిగింది. తిరుచానూరుకు సమీపంలోని యోగిమల్లవరంలో వెలసిన శ్రీ తిప్పలాధీశ్వర అనే పరాశరేశ్వర దేవాలయం ఉంది. ఆ ఆలయంలో నిత్యం అభిషేకం, అన్నప్రసాద నైవేద్యం చేయడాని జయిన్‌ కొండ బ్రహ్మమారయన్‌ అనే దాత 26 1/4 కొలంజుల స్వచ్ఛమైన బంగారం తిరుచానూరు స్థానత్తారులకు ఇచ్చారు. ఈ మేరకు శిలాశాసనం రాయించారు. అయితే… బంగారం తీసుకున్నవారు… పరాశరేశ్వరునికి పూజలు, నైవేద్యాలు చేయించలేదు. 
 
ఇది వీర నరసింగయాదవ్ రాయలు దృష్టికి వెళ్లింది. తిరుచానూరు స్థానిత్తారులను న్యాయ విచారణకు పిలిపించారు. అయితే… తమకు ఏ విషయమూ తెలియదని వారు బుకాయించారు. అర్చకులు శిలాశాసనాలనే ఆధారంగా, సాక్ష్యంగా చూపించారు. ఆలయంలో ఊడిగం చేసే వారినీ రాజు విచారించారు. వారు కూడా శిలాశాసనంలోని సమాచారం వాస్తవమేనని చెప్పారు. దీంతో రాజు…. తిరుచానూరు స్థానత్తారుల నుంచి 26 1/4 కొలంజుల బంగారాన్ని వసూలు చేసి…. పరాశరేశ్వర స్వామి భాండాగారానికి స్వాధీనపరిచారట. ఇవి మన ప్రాంతంలోని రెండుచోట్ల జరిగిన ఉదంతాలు. ఇక దేశ వ్యాప్తంగా ఎంతమంది ఆలయాల సొమ్ము దిగమింగారో?!