గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 8 ఏప్రియల్ 2021 (09:32 IST)

తిరుపతిలో ఉప ఎన్నికలు.. ప్రచార బరిలోకి ఏపీ సీఎం జగన్..!?

తిరుపతిలో ఉప ఎన్నికల ప్రచారం హీటెక్కుతోంది. ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ ప్రచార బరిలో వున్నాయి. తాజాగా వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్‌ ఉప ఎన్నిక ప్రచార బరిలోకి దిగుతున్నారు. ఈ నెల 14వ తేదీన తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొని.. రేణిగుంట సమీపంలో ఏర్పాటు చేసే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు సీఎం జగన్‌. 
 
అయితే పూర్తి స్థాయిలో పర్యటన షెడ్యూల్‌ ఇంకా ఖరారు కానట్లు తెలుస్తోంది. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక పోలింగ్‌ ఈ నెల 17న జరుగనుండగా.. వైసీపీ అభ్యర్థి గురుమూర్తికి భారీ మెజార్టీ లక్ష్యంగా ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రచారంలో పాల్గొంటున్నారు.
 
సీఎం జగన్‌ కూడా తిరుపతిలో పర్యటిస్తే.. రికార్డు స్థాయిలో మెజార్టీ వస్తుందని పార్టీ నేతలు భావిస్తున్నారు. దీంతో పార్టీ నేతలు పెద్దలు రేణిగుంట మండలం ఎల్లమండ్యంలోని యోగానంద కళాశాల సమీపంలో బహిరంగ సభకు అనువైన ప్రదేశాన్ని పరిశీలించారు. 
 
అక్కడి నుంచి తిరుపతి ప్రచారానికి రూట్‌ మ్యాప్‌పై కూడా చర్చించినట్లు తెలుస్తోంది. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు పార్టీ సమర శంఖారావం మొదటి సభ కూడా ఈ ప్రాంగణంలోనే చేపట్టడంతో పార్టీ నేతలు ఈ స్థలంలో బహిరంగ సభ ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారు.