శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 7 అక్టోబరు 2015 (15:03 IST)

చంద్రబాబుపైనే ఒత్తిడి.. ప్రత్యేక హోదా హామీ మరిచిపోయారు: జగన్

తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఒత్తిడి తీసుకురావడం కోసమే దీక్షను చేపట్టామని వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి తెలిపారు. చంద్రబాబుపై ఒత్తిడిని పెంచితే.. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తారని జగన్ వ్యాఖ్యానించారు. బాబు వస్తే జాబు వస్తుందని చెప్పారని, ఇప్పుడున్న ఉద్యోగాలను కూడా పీకేసే పరిస్థితి ఏర్పడిందని జగన్ విమర్శించారు. చదువుకున్న పిల్లలకు అన్యాయం జరుగుతోందని గుంటూరులో నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన సందర్భంగా జగన్ వ్యాఖ్యానించారు. 
 
ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రానికి మేలు జరుగుతుందని చెప్పిన చంద్రబాబు.. ప్రస్తుతం ఆ విషయాన్ని పూర్తిగా మరిచిపోయారని మండిపడ్డారు. హైదరాబాద్ లో 90 శాతం ఐటీ సంస్థలు, 70 శాతం పరిశ్రమలు ఉన్నాయని, ఈ నేపథ్యంలో, ఏపీ విద్యార్థులు ఉద్యోగాల కోసం ఎక్కడకు వెళ్లాలని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని కాంగ్రెస్, బీజేపీలు అడ్డగోలుగా విభజించాయని, కానీ, ఆనాడు ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని మాత్రం మరిచిపోయారని మండిపడ్డారు. మేనిఫెస్టోలో ఉంచిన హామీలన్నింటినీ టీడీపీ తుంగలో తొక్కిందని జగన్ విమర్శలు గుప్పించారు.