బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 3 జూన్ 2021 (09:44 IST)

పేదలందరికీ వైఎస్సార్ జగనన్న కాలనీలు .- నేడు సీఎం జగన్ శ్రీకారం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌ రెడ్డి మరో సంక్షేమ పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. 'వైఎస్సార్ జగనన్న కాలనీ'ల పథకాన్ని ప్రారంభించనున్నారు. ఇందులోభాగంగా తొలి విడతలో చేపట్టే 15,60,227 ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించనున్నారు. 
 
తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో ఇళ్ల నిర్మాణాన్ని జగన్ ప్రారంభిస్తారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.28,084 కోట్ల నిధులు కేటాయించింది. ఈ పథకంలో భాగంగా ఇల్లు కట్టుకునే స్తోమత లేనివారికి ప్రభుత్వమే ఇల్లు నిర్మించి ఇస్తుంది. 
 
స్థలం ఉండీ కట్టుకోలేని వారికి అందుకయ్యే ఖర్చును తన వాటా కింద భరిస్తుంది. రాష్ట్రంలో ఇలాంటి వారు 4.33 లక్షల మంది ఉన్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఈ పథకంలో భాగంగా నిర్మించే ఇళ్లు 340 చదరపు అడుగుల్లో ఉంటాయి. 
 
ఇక, ‘నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమంలో జూన్ 2023 నాటికి రెండు దశల్లో 28,30,227 ఇళ్లను నిర్మిస్తుంది. ఇందుకోసం రూ.50,994 కోట్లు ఖర్చు చేయనుంది. మొదటి దశను వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. రెండో విడత కింద 12.70 లక్షల ఇళ్లను రూ. 22,860 కోట్లతో నిర్మించనుంది. జూన్ 2023 నాటికి వీటిని నిర్మించి ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది.