శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 21 జూన్ 2020 (17:36 IST)

శభాష్... సీఎం జగన్ సముచిత నిర్ణయం తీసుకున్నారు : పవన్ కళ్యాణ్

ఏపీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్. జగన్మోహన్ రెడ్డిపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రశంసల వర్షం కురిపించారు. కరోనా వైరస్ కరాళ నృత్యం నేపథ్యంలో రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలను రద్దు చేస్తూ ఏపీ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని పవన్ కళ్యాణ్ స్వాగతించారు. 
 
కరోనా విజృంభిస్తోన్న తరుణంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల విజ్ఞప్తులను గౌరవించినందుకు ఏపీ సర్కారును మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్టు ఓ ప్రకటనలో తెలిపారు.
 
నిత్యం వందల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్న పరిస్థితుల్లో పదో తరగతి పరీక్షలు నిర్వహించాలని ఇంతకుముందు ఏపీ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు ఘోర తప్పిదంగా భావించారని, అయితే పరీక్షలు రద్దు చేస్తూ సరైన సమయంలో సముచిత నిర్ణయం తీసుకున్నారంటూ ప్రశంసించారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. 
 
'ప్రభుత్వం సముచిత నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను' అని పేర్కొన్నారు. ఇంటర్ అడ్వాన్స్, సప్లిమెంటరీ రద్దు చేసి ఉత్తీర్ణత ప్రకటించడం సరైన నిర్ణయమని పవన్‌ కళ్యాణ్‌ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.