1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Modified: సోమవారం, 26 నవంబరు 2018 (23:15 IST)

చంద్రన్నకు సెలవిద్దాం, జగనన్నను పక్కన పెడదాం... పవన్

పి.గన్నవరం బహిరంగ సభలో జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ... ప్రజలకు మంచి చేస్తూ నీతిమంతమైన పాలన చేస్తారని ఆశించి 2014లో తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలిస్తే ఆంధ్రప్రదేశ్‌ను అవినీతిమయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజనతో నష్టపోయిన యువతకు మెరుగైన భవిష్యత్ ఇవ్వాల్సిన బాధ్యతను ఈ ప్రభుత్వం విస్మరించింది అన్నారు. వారికి ఉపాధి, ఉద్యోగావకాశాలు ఎక్కడ అని ప్రశ్నించారు. 2019లో వచ్చే ఎన్నికలు కురుక్షేత్రమే అనీ, ధర్మం పక్షాన నిలిచే మనమే గెలుస్తామన్నారు. 
 
సోమవారం తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గ కేంద్రంలో జనసేన ప్రజా పోరాట యాత్రను నిర్వహించారు. భారీ సంఖ్యలో ప్రజలు హాజరై శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నీరాజనాలు పట్టారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రసంగిస్తూ "రాబోయే ఎన్నికల్లో చంద్రన్నకు సెలవిచ్చి, జగనన్నను పక్కన పెడదాం. జనసేన ప్రభుత్వాన్ని స్థాపిద్దాం. తెలుగుదేశం, వైసిపి పార్టీలు మనుషులను ఓట్లుగా చూస్తున్నాయి. 
 
మనుషుల్ని మనుషులుగా చూడాలి. 
 
వీళ్ళు ప్రజల మధ్య కులం, మతం, ప్రాంతం అంటూ చిచ్చులు రేపుతున్నారు. వాళ్ళ స్వార్థం కోసమే చేస్తున్నారు. వాళ్ళకి అభివృద్ధి చేసే శక్తి లేక, దోపిడీకి అలవాటుపడి ప్రజల మధ్య చిచ్చు రేపుతున్నారు. మానవత్వంతో చూస్తే కులం, మతం ప్రాంతం ఏవీ కనిపించవు. జనసేన ప్రజలకి పాతికేళ్ల భవిష్యత్‌ను ఇచ్చేందుకు వస్తుంది. నేనేదో ఐదేళ్లకోసారి ఎన్నికల కోసం వచ్చి రాజకీయం చేయను. పాలకులు చేసే తప్పులకు ప్రజలు శిక్ష అనుభవించ కూడదు అనుకొనేవాణ్ణి. విభజన సమయంలో ఆంధ్రులు దోపిడీదారులు అన్నారు. 
 
పాలకులు చేసిన దోపిడీలకు సామాన్య ప్రజలు మాటలుపడి అవమానాలకి గురయ్యారు. వీటిని స్వయంగా చూసినవాణ్ణి కాబట్టి ప్రజలకు మంచి భవిష్యత్ ఇచ్చేందుకు పార్టీపెట్టాను. నేను పార్టీ పెట్టినపుడు వేల కోట్ల రూపాయలు లేవు... అనుభవం ఉన్న నాయకులు లేరు. కానీ గుండెల నిండా దేశభక్తి ఉంది. జగన్‌లా వేల కోట్లు, చంద్రబాబు, లోకేష్‌ల్లా కోట్లు తెచ్చే హెరిటేజ్ లేదు... అయినా ప్రజలకు మంచి చేయాలనే బలమైన సంకల్పం ఉంది.