శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : గురువారం, 12 ఫిబ్రవరి 2015 (13:10 IST)

దేశ చట్టసభలు దండగ.. శుద్ధ దండగన్నర : జేసీ దివాకర్ రెడ్డి!

ఢిల్లీలో తెలుగు ఎంపీలను కరివేపాకులా తీసేస్తున్నారని అనంతపురం టీడీపీ ఎంపీ, మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు చెప్పిందే శాసనాలుగా మారుతున్నాయని విమర్శించారు. మంత్రులు, ఎంపీల మాటలకు ఏమాత్రం చెల్లుబాటు లేదన్నారు. అంతేకాకుండా, ఏపీ సీఎం చంద్రబాబు బాగా పని చేస్తున్నారని పేద ప్రజలు ఒక్కరూ కూడా అనుకోవడం లేదన్నారు. 
 
ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులకు విలువ లేకుండా పోయిందన్నారు. ఎంపీ, ఎమ్మెల్యేల ఎన్నికలు ఈ దేశానికి దండగ అని చెప్పారు. అందుకే ఈ అసెంబ్లీ, పార్లమెంట్ దండగ.. దండగన్నర అని చెప్పారు. ఆయా ప్రాంతాల ఎంపీలు చేసే ఒక్క సూచన లేద విన్నపాన్ని కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 
 
తన దృష్టిలో చట్ట సభలన్నీ వృథాగా మారిపోయాయని మండిపడ్డారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న తనలాంటి వారి సలహాలను కూడా కేంద్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమలాంటి వారి మాటలను విననప్పుడు ఎంపీల ఎన్నికలు ఎందుకని ప్రశ్నించిన జేసీ... ఎంపీల ఎన్నికల బదులు నేరుగా ప్రధానినే ఎన్నుకోవచ్చు కదా అని అన్నారు. ఆప్ దెబ్బకు ఢిల్లీలో బీజేపీ మట్టికరిచిందని సెటైర్ విసిరారు. భవిష్యత్‌లో ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరన్నారు.