శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : మంగళవారం, 1 సెప్టెంబరు 2015 (14:28 IST)

జగన్ మాటల్లో తప్పులేదు... చంద్రబాబు ఔట్‌ డేటెడ్ సీఎం : జేసీ దివాకర్ రెడ్డి

అధికార టీడీపీకి చెందిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైకాపా అధినేత, ఏపీ అసెంబ్లీ విపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గురించి చేసిన వ్యాఖ్యలను సమర్థించారు. జగన్ చెప్పినట్టుగా చంద్రబాబు 'ఔట్ డేటెడ్ సీఎం'లానే కనిపిస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. ఇది టీడీపీ వర్గాల్లో చర్చకు దారి తీసింది. 
 
ఏపీ వర్షాకాల సమావేశాల్లో చంద్రబాబు - జగన్‌ల మధ్య మాటల యుద్ధం సాగుతుండటంపై జేసీ స్పందిస్తూ చంద్రబాబుకు కోపం, ఆవేశం తక్కువని, ఆ విషయంలో చంద్రబాబుతో పోలిస్తే జగన్ ఎంతో ముందు నిలిచాడని చెప్పారు. అందువల్లే తాను కొన్ని విషయాల్లో జగన్‌ను సమర్థించాల్సి వస్తోందన్నారు. 
 
ఇకపోతే ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రానేరాదన్నారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతో పాటు.. ఏపీ మంత్రులు, ఎంపీలంతా రాజీనామా చేసినా రాష్ట్రానికి హోదా రాదని తేల్చిపారేశారు. ఒకవేళ జగన్ హోదా తీసుకు రాగలిగితే తాను రాజీనామా చేస్తానని అన్నారు. హోదా రాదు గానీ, ఓ మంచి ప్యాకేజీ వచ్చే అవకాశాలు ఉన్నాయని, బీహార్‌కు ఇచ్చిన నిధుల కన్నా ఎక్కువగా నిధులు ఏపీకి వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. 
 
హోదా గురించి చర్చలు, రాజీనామాలు చేయాలన్న డిమాండ్లు మరచి, అభివృద్ధి దిశగా ముందుకు సాగేందుకు కృషి చేయాలని సూచించారు. అంతేకాకుండా, హోదా కోసం పోరాటానికి ముందు నిలిచి, వస్తుందంటే తనతో పాటు మరో 10 మంది ఎంపీలతో రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆయన ప్రకటించారు. జగన్ తమవాడేనని అభిప్రాయపడ్డ జేసీ, రాజకీయాల్లో ఆయన మరింతగా రాటుదేలాల్సి వుందని జేసీ సూచించారు.