బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 6 జనవరి 2021 (18:58 IST)

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి.. ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అరూప్  కుమార్ గోస్వామితో ప్రమాణ స్వీకారం చేయించారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం ప్రాంగణంలో బుధవారం ఈ కార్యక్రమం నిర్వహించారు.

తొలుత గవర్నర్ వారి అనుమతితో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  ఆదిత్యానాధ్ దాస్ రాజ్యాంగ బద్దమైన ప్రక్రియను ప్రారంభించారు. హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ జస్టిస్ అరూప్  కుమార్ గోస్వామిని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా భారత రాష్ట్రపతి నియమించిన నోటిఫికేషన్‌ను చదివి వినిపించారు.

తరువాత రాజ్యాంగ నిబంధనల మేరకు జస్టిస్  అరుప్ కుమార్ గోస్వామినితో గవర్నర్ హరిచందన్ ప్రమాణ స్వీకారం చేయించారు.  ఎపి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అరూప్  కుమార్ గోస్వామి బాధ్యతలు స్వీకరించిన నేపధ్యంలో  గవర్నర్, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సిజెను శాలువ, పుష్పగుచ్చాలతో సత్కరించారు.

కార్యక్రమంలో పలువురు హైకోర్టు న్యాయమూర్తులు,మంత్రులు,పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, ప్రభుత్వ సలహాదారులు, గవర్నర్ వారి కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, జిఎడి కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, జిల్లా పాలనాధికారి ఇంతియాజ్ అహ్మద్, జిల్లా సంయిక్త పాలనాధికారి మాధవి లతతో పాటు పలువురు సీనియర్ అధికారులు, స్ధానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.