మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శనివారం, 23 ఫిబ్రవరి 2019 (17:28 IST)

పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చింది.. అందుకే జ్యోతిని చంపేశా...!

పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తేవడంతో జ్యోతిని అడ్డు తొలగించుకునేందుకు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ఆమె ప్రియుడు శ్రీనివాస్ అంగీకరించాడు. గుంటూరు జిల్లా నవులూరు వద్ద జరిగిన అంగడి జ్యోతి హత్యకేసులో ఆమె ప్రియుడే నిందితుడని పోలీసులు తెలిపారు. శ్రీనివాస్‌తో పాటు అతడి సన్నిహితుడు పవన్‌ని అరెస్టు చేశామన్నారు. 
 
హత్య కేసు నుంచి తప్పించుకునేందుకు శ్రీనివాస్ పకడ్బందీగా ప్లాన్ చేశాడని, పోలీసులు తీవ్రంగా శ్రమించి నిందితులను గుర్తించారని గుంటూరు అర్బన్ ఎస్పీ విజయరావు తెలిపారు. సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఈ కేసును విచారించామని ఎస్పీ చెప్పారు. 
 
జ్యోతి హత్య కేసులో ప్రధాన నిందితుడైన ప్రియుడు శ్రీనివాస్‌‌ను అరెస్ట్‌ చేశామని, చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. జ్యోతి, శ్రీనివాస్‌లకు ముందు నుంచే పరిచయం ఉందని, ఈ పరిచయం ప్రేమగా మారిందన్నారు. 
 
అలాగే ఏళ్ల తరబడి స్నేహంతో వాళ్లు మరింత దగ్గరయ్యారని ఎస్పీ తెలిపారు. అలాగే శ్రీనివాస్‌ స్నేహితుడు కటారి పవన్‌కల్యాణ్ కూడా జ్యోతికి తెలుసని వెల్లడించారు. జ్యోతిని హతమార్చడానికి పథకం వేసిన శ్రీనివాస్, ఇందుకు తన స్నేహితుడు పవన్ కల్యాణ్ సాయం కోరాడని.. అందుకు అతడు సహకరించాడని ఎస్పీ చెప్పారు.