శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 14 డిశెంబరు 2019 (11:34 IST)

వివాహేతర హత్య.. అడ్డుగా ఉన్నాడనీ టర్పెంటైన్ పోసి నిప్పంటించారు...

కర్నాటక రాష్ట్రంలో దారుణం జరిగింది. హైదరాబాద్ నగరానికి చెందిన వ్యక్తి హత్యకు గురయ్యాడు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడన్న కోపంతో ఈ హత్య జరిగింది. ఇందులో హతుడి భార్య హస్తం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఏపీలోని కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలానికి చెందిన నాగరాజు (40) అనే వ్యక్తి భార్యతో కలిసి హైదరాబాద్ ప్రగతినగర్ పరిధిలోని ఎలీప్ ప్రారిశ్రామికవాడలో అద్దెకు ఉంటున్నాడు. భార్యాభర్తలు ఇద్దరూ వేర్వేరు కంపెనీల్లో పనిచేస్తూ జీవిస్తున్నారు. నాలుగేళ్ల క్రితం ప్రగతినగర్‌కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి వెంకటేశ్వర్‌ రెడ్డి వద్ద దంపతులిద్దరూ పనికి కుదిరారు.
 
ఈ క్రమంలో నాగరాజు భార్యతో వెంకటేశ్వర్‌ రెడ్డికి వివాహేతర సంబంధం ఏర్పడింది. విషయం తెలిసిన భర్త ఇద్దరినీ నిలదీశాడు. ఆపై మరో ఇంటికి మారిపోయాడు. ఈ క్రమంలో ఈనెల 10వ తేదీన నాగరాజును కారులో ఎక్కించుకుని తీసుకెళ్లిన వెంకటేశ్వర్‌ రెడ్డి మళ్లీ తిరిగి తీసుకురాలేదు. 
 
దీంతో అతడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంకటేశ్వర్‌రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించగా హత్య విషయం వెలుగులోకి వచ్చింది. తమ మధ్య సంబంధానికి నాగరాజు అడ్డుగా ఉండడంతోనే హత్య చేసినట్టు పోలీసుల వద్ద నిందితుడు అంగీకరించినట్టు తెలుస్తోంది. 
 
తన వద్ద పనిచేసే మరో కార్మికుడు మానెప్ప సొంతూరైన కలబురిగి సమీపంలో నాగరాజును హత్య చేసినట్టు సమాచారం. కారులో నాగరాజును ఎక్కించుకుని వెళ్లిన తర్వాత అందరూ కలిసి మద్యం తాగారు. ఆపై నాగరాజుపై టర్పెంటైన్ పోసి నిప్పు పెట్టినట్టు నిందితుడు వెల్లడించాడు. కాగా, ఘటనా స్థలానికి చేరుకున్న చించోలి పోలీసులు నాగరాజు మృతదేహానికి అక్కడే పోస్టుమార్టం నిర్వహించారు. 
 
నాగరాజు హత్య విషయం అతడి భార్యకు ముందే తెలిసి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులు ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా, నిందితుడు వెంకటేశ్వర్‌ రెడ్డి ఏడాదిగా నాగారాజు హత్యకు ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. 
 
ఆరు నెలల క్రితం అమెరికాలో ఉంటున్న కుమార్తెల వద్దకు వెళ్లిన నిందితుడు వెంకటేశ్వర్‌ రెడ్డి గత నెల 29న హైదరాబాద్ వచ్చాడు. వచ్చీ రావడంతో హత్య పథకాన్ని అమలు చేసి నాగరాజును అంతమొందించాడు.