అమ్మతోడు ... నన్ను నమ్మండి.. చిరంజీవిని పకోడిగాడు అని అనలేదు.. కొడాలి నాని
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకుని ఏపీ మంత్రి, వైకాపా నేత కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిరంజీవిని తాను పకోడిగాడు అని అన్నట్టుగా సాగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదన్నారు. చిరంజీవిని విమర్శించేంత సంస్కారహీనుడిని కాదని అన్నారు. పైగా, ఒక పెద్ద మనిషిగా ఆయన చెప్పే సూచనలు పాటిస్తామని తెలిపారు. అదేసమయంలో తాను శ్రీరామ అన్నా.. టీడీపీ, జనసేన పార్టీ నేతలకు బూతులుగానే వినిపిస్తాయని ఎద్దేవా చేశారు. చిరంజీవిని తాను విమర్శించినట్టు నిరూపించాలని ఆయన సవాల్ విసిరారు.
గుడివాడలో జరిగిన మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు వేడుకల్లో కొడాలి నాని పాల్గొన్నారు. ఇందులో ఆయన మాట్లాడుతూ, చిరంజీవిని ఆరోజు.. ఈరోజు ఎప్పుడైనా కూడా నేను గౌరవిస్తానని చెప్పారు. చంద్రబాబునైనా, వాడి బాబు ఖర్జూర నాయుడునైనా, వాడి తాత లవంగం నాయుడునైనా, వాడి ముత్తాత యాలక్కాయ నాయుడునైనా అంటాము.. కానీ చిరంజీవిని ఎప్పుడూ పల్లెత్తు మాట అనలేదన్నారు.
ఎవరి జోలికి వెళ్లని పెద్దాయన చిరంజీవిని విమర్శించేంత సంస్కారహీనుడిని కాదన్నారు. చిరంజీవి అభిమానుల ముసుగులో టీడీపీ, జనసేన పార్టీ శ్రేణులు గుడివాడి రోడ్లపై దొర్లాయి. చిరంజీవికి, మాకు మధ్య గ్యాప్ ఉన్నట్టు సృష్టించాలని టీడీపీ, జనసేన పార్టీలు ప్రయత్నం చేశాయని అని ఆరోపించారు. పైగా, ఒక పెద్దామనిషిగా చిరంజీవి చెప్పే సూచనలు పాటిస్తామన్నారు.
మాకు ఇచ్చినట్టు డ్యాన్సులు, నటన చేతగాని ఇండస్ట్రీలోని పకోడీగాళ్లకు కూడా చిరంజీవి సలహాలు ఇవ్వాలనే తాను చెప్పానని తెలిపారు. ఇండస్ట్రీలో శిఖరాగ్రాన ఉన్న చిరంజీవి డ్యాన్సులు, యాక్షన్ రావా? నేను ఆయన గురించి మాట్లాడినట్టు ఎలా అవుతుంది?, తన వెంట ఉన్న వారిలో 60 శాతం మంది చిరంజీవి అభిమానులేనని కొడాలి నాని చెప్పారు.